నల్లగొండ జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలను ప్రారంభించి, ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నల్లగొండ జిల్లాకు టీ హబ్, టాస్క్ సెంటర్ కూడా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే సంవత్సర కాలంలో నల్లగొండ ముఖచిత్రం, రూపురేఖలు మారుస్తామని ఆయన పేర్కొన్నారు. నల్లగొండకు ఐటీ హబ్ సీఎం కేసీఆర్ పుణ్యమే అని చెప్పారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాం. ఐటీ పరిజ్ఞానం సామాన్యులకు అందాలని సీఎం చెప్పారు. నల్లగొండలో రాబోయే 18 నెలల కాలంలో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తాం. వివిధ కంపెనీలు 1600 కొలువులు ఇస్తామన్నారు. ఐటీ అంటే కొలువుల కోసం బిల్డింగ్ కట్టడం కాదు. టాస్క్ పేరిట ఇదే బిల్డింగ్‌లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ అందిస్తాం. టాస్క్ సెంటర్‌తో పాటు టీ హబ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ ప్రకటించారు. స్థానిక యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
నల్లగొండ ముఖచిత్రం మారుస్తాం..
రాబోయే సంవత్సరం కాలంలో నల్లగొండ ముఖచిత్రం, రూపురేఖలు మారాలని మంత్రలుకు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు కేటీఆర్ తెలిపారు. నల్లగొండ పట్టణంలోని పేదల కోసం కొత్తగా ఐదు బస్తీ దవాఖానలు మంజూరు చేస్తున్నాం. రూ. నాలుగున్నర కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్, రూ. మూడు కోట్లతో రెండు వైకుంఠధామాల ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. నల్లగొండలో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుకు చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో సమ్మిళితమైన అభివృద్ధి చేస్తున్నాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, నాయకత్వం ఉన్నది. కానీ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఏ రాష్ట్రంలో జరగడం లేదు. రాష్ట్రంలో పూర్వపు నల్లగొండ జిల్లా వరి ధాన్యాన్ని అత్యధికంగా ఇస్తున్నది. దేశ వ్యాప్తంగా చూస్తే పంజాబ్ కంటే తెలంగాణ అధిక ధాన్యాన్ని ఇస్తుందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణాభివృద్ధిలో, పరిశ్రమలు, ఐటీలో దూసుకుపోతున్నాం. అన్ని రంగాల్లో భారతదేశంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలుపుతున్నాం. ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైందని కేటీఆర్ అన్నారు.
ఇతర రాష్ట్రాలకు చేయూతనిచ్చే స్థాయికి తెలంగాణ..
ఇవాళ సీఎం కేసీఆర్ ఏకకాలంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాలను అమలు చేస్తూ.. పట్టణాలను, పల్లెలను అభివృద్ధి చేస్తున్నారు. మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు ఠంచన్‌గా నిధులు మంజూరు చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో కులమతాల పేరిట పంచాయితీలు నెలకొన్నాయి. కానీ తెలంగాణలో ఒక వ్యూహాంతో ముందుకు పోతున్నాం. నెల రోజుల కింద ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ భౌగోళికంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం, జనాభాపరంగా చూస్తే 12వ పెద్ద రాష్ట్రం. కానీ భౌగోళికంగా 11, జనాభాపరంగా 12 ర్యాంకులు ఉండొచ్చు. కానీ భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రం 4వ అతిపెద్ద చోదక శక్తి తెలంగాణ. ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆర్బీఐనే స్పష్టం చేసింది. భారతదేశంలోని ఇతర పేద రాష్ట్రాలకు చేయూతనిచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగింది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫ్లోరోసిస్‌ను నిర్మూలించాం..
సంక్షేమం, అభివృద్ధి జోడేద్దుల మాదిరిగా ముందుకు వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు కరెంట్ లేక రైతులు విలవిలలాడిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను నిర్మూలించాం. నల్లగొండకు, సూర్యాపేటకు మెడికల్ కాలేజీ ఇచ్చాం. భువనగిరిలో ఎయిమ్స్ నెలకొల్పాం. ఏ పాలకుడైనా యాదాద్రిని పట్టించుకున్నారా? రూ. 1800 కోట్లు ఖర్చు పెట్టి యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నాం. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును దామరచర్లలో ఏర్పాటు అవుతోంది. దీని సామర్థ్యం 4 వేల మెగావాట్లు అని కేటీఆర్ తెలిపారు.