రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యం: మంత్రి కొప్పుల

188
Minister Koppula Eshwar
- Advertisement -

కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతున్నాయని అది చూసి ప్రతిపక్ష నాయకుల కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవ చేశారు. కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ రైతు వేదికను మంత్రి కొప్పుల చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు వేల ఎకరాల క్లస్టర్ ఆధారంగా 20 లక్షల రూపాయలతో రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగింది. సుమారు 300మందితో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు.రైతు వేదికలో ఒక హాల్,ఒక కంప్యూటర్ గది, అధికారులు కూర్చోడానికి ఒక గది ఉంటుది. అలాగే రైతుల సౌలభ్యం కోసం కల్లాల ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 750 కోట్లతో రైతు కల్లాలు నిర్మించాం. మండలానికి 1000 కల్లాల ఏర్పాటు చేశాం. రైతుల దరఖాస్తులను బట్టి కల్లాలను పెంచాలని మంత్రి అన్నారు.

రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని. కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు,ప్రజాప్రతినిధులు పని చేయాలి. రైతు కల్లాల గురించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతుల కోసం కరోనా,లాక్ డౌన్ ఉన్నప్పటికీ 30 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 1300 కోట్లతో 25000 లోపు రైతు రుణమాఫీ చేశారు. 7000 కోట్లతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 5000 చొప్పున జమ చేయడం జరిగింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కొనియాడారు. అంతేకాదు రైతులకు భూమి విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా డిజిటల్ భూమి పాసుపుస్తకాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాకముందు చొప్పదండి నియోజకవర్గం ఎడారిని తలపించేది. తాగుదామంటే నీళ్ళకు కరువుండేది. ఉపాధి లేక వలసలు పోయి బ్రతికేవారు ఇక్కడి రైతులు. కానీ కేసిఆర్ ముఖ్యమంత్రి ఐన తరువాత కాళేశ్వరం నీళ్ళతో చొప్పదండి నియోజకవర్గంలో కరువు పారిపోయింది. చొప్పదండి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌస్ నిర్మించడం,లక్ష్మీపూర్ పంపుహౌస్ ద్వారా నారాయణ పూర్ జలాశయానికి ఒకవైపు, మద్యమానేరు జలాశయానికి ఒకవైపు రెండు వైపులా నీళ్ళను పంపిస్తున్నారు. మధ్యమానేరు జలాశయం నుండి రాష్ట్ర నాలుగు దిక్కులా నీళ్ళు వెళ్ళడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

- Advertisement -