కాంగ్రెస్ నాయకులపై మంత్రి తలసాని ధ్వజం..

369
Minister Talasani Salms Congress And BJP
- Advertisement -

పనికి మాలిన చవటలు, దద్దమ్మలు లాక్ డౌన్ ప్రారంభమైన నెలరోజుల తర్వాత రాజకీయ ఉనికి కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ధ్వజమెత్తారు,శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కన్నా బిడ్డలుగా చూసుకుంటున్నా కాంగ్రెస్ నేతలకు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

తమ పంటలను అమ్ముకునేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలను కన్న బిడ్డలుగా భావించి ప్రభుత్వం అన్ని విధాలుగా మేలు చేసేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రశంసించినట్లు చెప్పారు. ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఫోన్‌లో మాట్లాడి రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారని అన్నారు.

కేంద్ర మంత్రులు, అధికారులు తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందిస్తుంటే స్థానిక జీజేపీ నేతలు బాద్యత లేకుండా మాట్లాడుతుండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు రైళ్ళలో ఉచితంగా చేర్చే బాద్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలన్న తన సూచనను స్వీకరిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పినట్లు వివరించారు. లాక్ డౌన్ లో ఎవరు కూడా ఆకలితో అలమటించ వద్దని తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఒకొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి 1500 రూపాయలు, వలస కూలీలకు ఒకొక్కరికి 12 కిలోల బియ్యం, ఒకొక్కరికి 500 రూపాయలను అందించడం జరిగిందని, 2 వ విడత పంపిణీ కూడా ప్రారంభమైందని చెప్పారు.

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్పారు. కరోనా టెస్ట్ లు తక్కువ చేస్తున్నారన్న వాదన అవాస్తవమని, ప్రభుత్వం నిబద్దత తో పనిచేస్తుందని అన్నారు. మటన్ లో బీఫ్ కలుపుతున్నారన్న ప్రచారం తప్పు అన్నారు. మటన్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, వరుస తనిఖీలతో ధరలను నియంత్రించడంతో పాటు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పలు షాప్ లను సీజ్ చేసినట్లు వివరించారు.

- Advertisement -