జూన్ 8 నుంచి చేపమందు పంపిణీ..

321
fish medicine

బత్తిని సోదరుల చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన తలసాని 173 సంవత్సరాల నుండి వంశపారం పర్యంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని ఇప్పుడు అదే సంప్రదాయాన్ని బత్తిని హరనాథ్ గౌడ్ కొనసాగిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో చేప మందు తీసుకోవడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాట్లకు ముందుకువచ్చాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 5 రూపాయలకే భోజనం వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ ఆధ్వర్యంలో రవాణా వసతులు కల్పిస్తామని చెప్పారు. అందరికి చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తోందన్నారు బత్తిని హరనాథ్ గౌడ్‌. జూన్ 8వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ రాత్రివరకు చేప మందు పంపిణీ జరుగుతుందన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపమందు పంపిణీ లభించని వారికి తమ ఇంటివద్ద అందజేస్తామన్నారు. ప్రజలందరికీ సరిపోయేలా చేప ప్రసాదాన్ని తయారు చేస్తామన్నారు.