తెలంగాణ రాకముందు గడిచిన 70 ఏళ్ళు నీళ్లు,నిధులు,కరెంట్ లేక ప్రజలు పడ్డ బాధలు మనం చూశాం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలు ఆశించిన పాలన జరగలేదు. బ్రిటిష్-నైజాం కాలంలో ఉన్న రెవెన్యూ చట్టం వల్ల ప్రజల్లో ఎప్పుడూ ఏదో లొల్లి ఉండేది. 7 దశాబ్దాల కాలం నుంచి వస్తున్న బాధ కొత్త రెవెన్యూ చట్టంతో తొలిగిపోతుందని ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వాలు-నాయకులు మారినా యంత్రాంగం మాత్రమే మారదు. కోట్లాది మంది ఆడపడుచులకు కల్యాణ లక్ష్మితో పెళ్ళి చేసిన ఘనత టీఆరెస్ ప్రభుత్వానిది,కేసీఆర్ ది. గత ప్రభుత్వాల పాలనలో రైతుల ఆత్మహత్యలు వర్ణనాతీతం. తెలంగాణ ఏర్పడిన తరువాత 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఎవ్వరికి లేదు అది కేసీఆర్ కి తప్ప. గతంలో అసెంబ్లీ సమావేశాలు అంటే నిరసనలు,ధర్నాలతో దద్దరిల్లేది. కానీ గడిచిన ఏడేళ్లుగా ఎండిన వరి,వాడిన జొన్న కంకి కనిపించడం లేదు. దేశ-రాష్ట్ర రాజకీయ అంచనాలను తారుమారు చేసి రెండోసారి అధికారం తెచ్చిన ఘనత కేసీఆర్ ది అని మంత్రి అన్నారు.
కొత్త రెవెన్యూ చట్టం గొప్పగా ఉంది కాబట్టే ప్రతిపక్షాలు సైతం ఒప్పుకోకతప్పలేదు. జీవో 58 తెచ్చి గ్రేటర్ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం కేసీఆర్ చూపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణ ప్రజలకు గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత దేశంలో ఒక్క కేసీఆర్ కె దక్కుతుంది. కాగా కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండటం హైదరాబాద్ ప్రజల అదృష్టం. హైదరాబాద్ లో మెట్రో రైల్ కు కాంగ్రెస్ అనుమతి ఇచ్చినా దాన్ని పూర్తి చేసిన ఘనత టీఆరెస్ ప్రభుత్వానిది. సైబరాబాద్ లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చుస్తే స్విట్జర్ ల్యాండ్ లో ఉన్నట్లు అనిపిస్తది.
డబుల్ బెడ్ రూం పథకం అనేది నిరంతర ప్రక్రియ ..సీఎం స్వయంగా పేదలకు ఇళ్ళు ఇవ్వాలని స్టార్ట్ చేసిన పథకం. కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ లేదు..గాంధీపై తప్పుడు ప్రచారం చేశారు. ఆరోగ్యశ్రీ ముందు ఆయుష్మాన్ భారత్ పనికిరాదు. కేంద్ర బృందాలు సైతం కరొనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నాయి. పీపీఈ కిట్లు దాపెట్టుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు వింటే నోవ్వొస్తుందని మంత్రి ఎద్దేవ చేశారు.
ప్రతి యుగానికి ఒకరు పుడతారు అతనే యుగపురుషుడు అవుతారు..ఆయనే కేసీఆర్. కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం అసెంబ్లీలో ఇస్తే సినిమా అన్నారు.ఇవ్వాళ సినిమా నిజం అయింది. రెవెన్యూ చట్టం ద్వారా చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు.