లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి- మంత్రి

57
Minister Satyavati

ఈరోజు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 30 ఆక్సిజన్ బెడ్లతో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును ప్రారంభించారు. అనంతరం కొవిడ్ బారిన పడ్డ తల్లిదండ్రులను పిల్లల సంరక్షణ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న బాలల పరిరక్షణ విభాగాన్ని, కొవిడ్ బారిన పడ్డ పిల్లలను ఇంటి నుంచి పరిరక్షణ కేంద్రానికి తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్ వాహనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ జక్కుల హర్షిణి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలు ఎవరూ వైద్యం అందక ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్‌ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నడుంబిగించారని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో సీఎం కేసీఆర్‌ సీరియస్ గా దాని నియంత్రణ, చికిత్సపై దృష్టి సారించారని తెలిపారు. కొవిడ్ కట్టడి కోసం అన్ని చర్యలు చేపడుతున్నారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా భూపాలపల్లి జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేశారని, అదే విధంగా మందుల కొరత ఉండకుండా మెడికల్ రీజినల్ సబ్ సెంటర్ ను ఇచ్చారని పేర్కొన్నారు. వీటివల్ల ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించి, విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.