గిరిజన శాఖలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు లబ్దిదారులకు మరింత చేరువయ్యేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని, ఇందుకోసం వారి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాల ద్వారా పెంచుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సూచించారు. గిరిజన శాఖ అధికారులు, సిబ్బందికి సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నేడు ఆమె ప్రారంభించారు. గిరిజనుల అభివృద్ధికి విశేష కృషి చేసిన, ఐ టి.డి.ఏ ల స్థాపనకు కారకులు అయిన స్వర్గీయ ఎస్.ఆర్ శంకరన్ కు ఆయన 80వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాధోడ్ మాట్లాడుతూ….గిరిజనులకు, దళితులకు అంబేద్కర్ తర్వాత అంతటి స్పూర్తినిచ్చిన మహానుభావులు ఎస్.ఆర్ శంకరన్ 80వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించుకునే అవకాశం రావడం నిజంగా అదృష్టం. గిరిజనులకు శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు 2.5 కోట్ల రూపాయలు కేటాయించి, ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం.
గవర్నర్ తమళిసై ఈరోజు గిరిజన శాఖపై సమీక్ష చేసి, గిరిజనులకు మరింత మేలు చేసేందుకు ఏం చేయాలని సూచించడం, మన శాఖ పనితీరును అభినందించినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను.
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసే గిరిజన అధికారులు, ఉద్యోగులకు ఈ శిక్షణ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ శిక్షణను గొప్ప అవకాశంగా మీరంతా భావించి, సద్వినియోగం చేసుకోవాలి.
శిక్షణ అనేది అందరికీ అవసరం. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా శిక్షణ తీసుకున్నాను.మనకున్న నైపుణ్యానికి ఈ శిక్షణ ద్వారా మరింత పదును పెట్టి సిఎం కేసిఆర్ గారి ఆశయం మేరకు బంగారు తెలంగాణ సాధనలో మనమంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. గతంలో గిరిజన శాఖ ద్వారా ఏ,ఏ పథకాలు అమలవుతున్నాయి, లబ్ది జరుగుతుందనేది అందరికీ చేరలేదు..కానీ నేడు అవన్ని లబ్దిదారులకు అందించే విధంగా ఇప్పుడు కృషి జరుగుతోంది. అదేవిధంగా ముఖ్యంగా గిరిజన శాఖలో కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము.
శిక్షణ ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన శాఖ ఉపాధ్యాయులు రూపొందించిన రెండు అభ్యాసిక పుస్తకాలను, ఉపాధ్యాయుల కరదీపికలను, తెలంగాణ లైఫ్ స్టైల్ పై రూపొందించిన డాక్యుమెంటరీలను మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా, గిరిజన విద్యాలయాల ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.