ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు చిలుకానగర్ డివిజన్‌లోని అయా కాలనీలలో అభ్యర్థి శ్రీమతి గీత ప్రవీణ్ ముదిరాజ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగడానికి శాంతిభద్రతలు, మత సామరస్యం పాటించే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 110 సీట్లకు పైగా టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి సత్యవతి. అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కొవిడ్ వచ్చినప్పుడు, మహానగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు కనిపించని బీజేపీ నేతలు నేడు ఎన్నికలు రాగానే సంక్రాంతి పండక్కు పగటి వేషగాళ్లు, గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు కేంద్రం నుంచి మంత్రులు, ఇతర రాష్ట్రాల నేతలు వస్తున్నారని మంత్రి విమర్శించారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలను తీసుకొచ్చే నాయకత్వం కావాలో ఉద్వేగాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలు లేకుండా చేసే బీజేపీ కావాలో విజ్ఞులైన జీహెచ్ఎంసీ ఓటర్లు నిర్ణయించుకోవాలని మంత్రి అన్నారు. వాళ్లు పాలించే ప్రాంతాల్లో రూపాయి కూడా ఇవ్వని బీజేపీ హైదరాబాద్‌లో మాత్రం వేలకు వేలు ఇస్తామంటూ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తుందన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.