త్వరలో అంగన్‌వాడీ ఖాళీల భర్తీ..

33
sathyavathi

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెరిగాయని, విలువ పెరిగిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. అంగన్వాడీ సేవలు మరింత నాణ్యంగా అందించేందుకు కూడా త్వరలోనే అంగన్వాడీ ఖాళీలన్నీ భర్తీ చేయనున్నామని, ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు, శిశువులకు పోషకాహారాన్ని అందించేందుకు సిఎం కేసిఆర్ గారు ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారని, మరింత పోషకాహారాన్ని అందించేందుకు ఒక కమిటీని నియమించారని, ఆ కమిటీ నివేదికననుసరించి త్వరలో మరింత అదనపు పోషకాహారాన్ని అందించనున్నామని చెప్పారు.

రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేయడం, దీనిద్వారా లబ్దిపొందుతున్న వారి వివరాలు, ఇందుకోసం చేస్తున్న ఖర్చుపై గౌరవ సభ్యులు శ్రీమతి గొంగిడి సునీత, శ్రీమతి హరిప్రియ నాయక్, డాక్టర్ ఆనంద్ మెతుకు నేడు శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమాధానం ఇచ్చారు.

ఆరోగ్య లక్ష్మీ పథకం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా ఒక పూట పూర్తి భోజనం అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలకు అందిస్తున్నాం. 2015 జనవరి 1వ తేదీ నుంచి దీనిని అమలు చేస్తున్నాం అన్నారు. మహిళలు, పిల్లలలో అనుబంధ పోషకాహారాన్ని అందించేందుకు, రక్త హీనతను తగ్గించే లక్ష్యంతో ఈ పథకం అమలు జరుగుతోందని…కేంద్ర ప్రభుత్వ అనుబంధ పోషకాహారానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మీ పథకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తోందన్నారు. గర్భిణీలు, బాలింతలకు ప్రతి రోజు 200 ఎంఎల్ పాలు, గుడ్డుతో ఒక భోజనాన్ని ఇస్తున్నాం అన్నారు.

ఏడు నెలల నుంచి 3 ఏళ్లలోపు 16 గుడ్లతో భోజనాన్ని అందిస్తున్నాం అని తెలిపిన మంత్రి…మూడు నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఒక పూట భోజనం అందిస్తున్నాం అన్నారు.అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనం 10,500 తీసుకుంటున్నారు. ఇందులో కేంద్రం వాటా 2,700 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 7800 రూపాయలు.
పిఆర్సీ అమలు అయితే 13,650 రూపాయలు రానుంది. ఇందులో 2700 రూపాయల కేంద్ర వాటా తీసేస్తే మిగిలింది అంతా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోంది.
ఆయాలకు కేంద్రం వాటా రూ.1350, రాష్ట్ర వాటా రూ. 4650.పిఆర్సీ వస్తే 1800 రూపాయలు అదనంగా వస్తాయన్నారు.

అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీ కోసం పదో తరగతి అర్హతగా పెట్టింది వాస్తవవే. అయితే గౌరవ సభ్యులు ఆయాలకు అయినా విద్యార్హత తగ్గించండి, ఎక్కడైనా ప్రజా ప్రతినిధులుగా ఆయా పోస్టు కూడా ఇప్పించలేకపోతున్నామని సిఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన దీనిపై నోట్ తయారు చేయమని ఆదేశించారు. కాబట్టి ఇకపై భవిష్యత్ లో కలెక్టర్లు కాకుండా కొత్త విధానం అమల్లోకి రానుందన్నారు. అంగన్‌వాడీ ఖాళీలకు నోటిఫికేషన్ ఇచ్చాం… అంగన్వాడీ సేవలు మరింత నాణ్యంగా అందించేందుకు త్వరలోనే ఖాళీలు భర్తీ అవుతాయన్నారు.