అర్హులందరికీ రేషన్ కార్డులు- మంత్రి

119

ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండవద్దని నూతనంగా 3 లక్షల 9 వేల రేషన్ కార్డులు మంజూరు చేసారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభాలో రాష్టంలో 90.5 శాతం ప్రజలకు రేషన్ బియ్యం అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లక్షల 9 వేల 83 కార్డుల ద్వారా 8 లక్షల 65 వేల 430 మందికి లబ్ది చేకూరుతుందని అన్నారు. శుక్రవారంనాడు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని సరూర్ నగర్,ఆర్ కె పురం డివిజన్ లకు సంభందించి వాసవి కాలనీలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో నూతనంగా మంజూరు అయిన ఆహార భద్రత కార్డులను లబ్ధిదారులకు అందజేసారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి నెల 231 కోట్ల తో సంవత్సరానికి 2766 కోట్ల రూపాయలను ప్రజా పంపిణీ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.నూతన కార్డు దారులకు ఆగస్టు నెల నుండి రేషన్ అందించటం జరుగుతుందన్నారు.నెలకు అదనంగా14 కోట్ల విలువ గల 5200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 87.41 లక్షల కార్డులు ఉండగా కొత్త కార్డులతో కలిపి 90.50 కి చేరగా 2 కోట్ల 88 లక్షల లబ్ధిదారులకు నెలకు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.కరోనా సమయంలో రేషన్ కార్డు దారులతో పాటు ఉచిత బియ్యం,నగదు సహాయాన్ని వలస కార్మికులకు కూడా అందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు.రేషన్ డీలర్లకు సంభందించి సమస్యల పరిష్కారానికి కాబినెట్ సబ్ కమిటీని వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి గుర్తు చేశారు.