శనివారం చేపట్టిన బడిబాటలో కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ బడులలో చేరాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి ముచ్చటించారు.ఇంటింటి పాదయాత్రలో భాగంగా పలువురు విద్యార్థులు ఎదురుకాగా మీరు ఏ పాఠశాలలో చదువుతున్నారని మంత్రి ప్రశ్నించగా ప్రభుత్వ పాఠశాలలో అని వారంతా చేతులెత్తి జవాబు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలను రంగురంగుల బొమ్మలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తరగతి గదులు,మంచి ఫర్నిచర్, సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం,స్కూల్ యూనిఫామ్ లు,పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నామని,మీ మిత్రులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యను భోదిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులతో మాట్లాడారు మంత్రి సబితారెడ్డి.అంగన్ వాడి పిల్లలను కూడా అన్ని సౌకర్యాలు కల ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.