ఆర్టీసీలో ఉద్యోగ భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం- మంత్రి పువ్వాడ

272
- Advertisement -

టిఎస్‌ఆర్టీసీలో ప్ర‌యాణీకుల‌కు మెరుగైన ర‌వాణా సేవ‌లు అందించ‌డంతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ చెప్పారు. సంస్థాగ‌త విష‌యాల‌పై ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో బుధ‌వారం సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, టి.ఆర్‌.అండ్ బి ముఖ్య కార్య‌ద‌ర్శి సునీల్ శ‌ర్మ‌ ఐఏఎస్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ల‌తో స‌మీక్షించారు. మ‌రీ ముఖ్యంగా సిబ్బంది ఉద్యోగ భ‌ద్ర‌త‌, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల్ని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సూచించిన విధంగా టిఎస్‌ఆర్టీసీ బ‌లోపేతంతో పాటు ఉద్యోగుల సంక్షేమం దిశ‌గా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని మంత్రి చెప్ప‌గా ఈ క్ర‌మంలోనే ఉద్యోగ భ‌ద్ర‌త విధివిధానాల‌ను వారం రోజుల్లోగా త‌యారు చేసి అందించ‌నున్న‌ట్లు సంబంధిత ఇ.డిలు మంత్రికి తెలిపారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని, ప్ర‌తి మంగ‌ళ‌వారం ఉద్యోగుల స‌మ‌స్య‌ల విన‌తుల ప‌రిష్కారానికై దృష్టి సారించాల‌ని సూచించారు. అధికారులు వారి వారి ప‌రిధిలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క రించాల‌ని, అలా కాకుండా ఉద్యోగుల‌ను వేధ‌న‌కు గురిచేయడం త‌గ‌ద‌ని, ఈ విష‌యంలో అధికారులు సానుకూల దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు.

Minister Puvvada Ajay Kumar

ఒ.డి, మెడిక‌ల్ గ్రౌండ్, సెల‌వుల కోసం వ‌చ్చే విన‌తుల‌పై మాన‌వ‌తా దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని, ఉద్యోగుల విన‌తుల్ని మూడు విభాగాలుగా క్రోడీకరించి వాటిని ప్రాధ‌న్య‌త క్ర‌మంలో ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. బ‌స్సుల్లో బాధ్య‌త‌గా టికెట్ తీసుకునే ప్ర‌త్యేక విధానంపై ప్ర‌యాణీకుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెబుతూ ఒ.ఆర్ పెంపు కోసం కృషి చేయాల్సి ఉంద‌న్నారు. సిఎం ఆశించిన తీరుగా సంస్థ‌ను అభ్యున్న‌తి వైపు తీసుకెళ్ల‌డానికి అంద‌రూ ప్ర‌య‌త్నించాల‌న్నారు. ప్ర‌యాణీకుల ఆద‌ర‌ణ కోసం మ‌రింత‌ ప్ర‌య‌త్నం చేయాలని మంత్రి తెలిపారు.

ఎం.డి శ్రీ సునీల్ శ‌ర్మ మాట్లాడుతూ.. ప్ర‌యాణీకుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం క‌ల్పించే విష‌యంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు టిఎస్‌ఆర్టీసీ ఎం.డి, టి.ఆర్ అండ్ బి ముఖ్య కార్య‌ద‌ర్శి సునీల్ శ‌ర్మ‌ ఐఏఎస్ మంత్రికి వివ‌రించారు. న‌గ‌రంలోని బ‌స్టాండుల‌లో, కూడ‌ళ్ల‌లో ప్ర‌త్యేకంగా బ‌స్సుల రాక‌పోక‌ల‌కు సంబంధించిన స‌మాచారం అందించడంతో పాటు స్టేజీల వివ‌రాల‌ను తెలియ‌జేసే విష‌యంపై త‌గు కార్యాచ‌ర‌ణ విధానాల‌ను అమ‌లులోకి తేనున్న‌ట్లు చెప్పారు. ప్ర‌యాణీకుల‌తో స్నేహ‌ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం, బ‌స్సు ఎక్కే ప్ర‌యాణీకుల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా ఆహ్వ‌నం ప‌ల‌క‌డం, ప్ర‌త్యేక రోజుల్లో ప్ర‌యాణీకులను విధిగా విష్ చేయ‌డం వంటి వాటిపై సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ స‌మావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ( రెవెన్యూ, ఐటి), సంస్థ కార్య‌ద‌ర్శి పురుషోత్తం, ఇ.డి (ఇ) వినోద్ కుమార్‌, ఇ.డి(ఎ) టి.వి.రావు, ఇ.డి (ఒ) యాద‌గిరి, ఇ.డి (జి.హెచ్‌.జ‌డ్‌) వెంక‌టేశ్వ‌ర్లు, ఎఫ్‌.ఎ ర‌మేశ్‌, ఎస్‌.ఎల్‌.ఒ శ్రీల‌త‌, సి.పి.ఎం సూర్య కిర‌ణ్‌, సీనియ‌ర్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ మేనేజ‌ర్‌ జి.ఆర్‌.కిర‌ణ్, త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -