మాదకద్రవ్యాలను వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మాదకద్రవ్యాలకు ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమని, దేశ శక్తిని, యువతను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ సమాజ మనుగడకు, యువత జీవితానికి వినాశనకారి అన్నారు. దీన్ని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రవాణా, వినియోగంపై సీఎం కేసిఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట నిఘా పెట్టినట్లు మంత్రి చెప్పారు.
డ్రగ్స్ వాడకం వల్ల భవిష్యత్ చీకటిమయం అవుతుందని, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటే ఉజ్వల భవిష్యత్ పొందవచ్చని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం డ్రగ్ మాఫియాపై యుద్ధం ప్రకటించిందని ఎంతటివారైనా ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.