రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది కి పైగా ఆడపడచులకు ఉచితంగా చీరలు పంపిణి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆడపడచులకు చీరలు పంపిణీ చేశారు మంత్రి పువ్వాడ అజయ్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.
ఈసందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉన్నా బడ్జెట్ లో దేనికి కోత లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. తెలంగాణ ఆడపడచులకు తీరొక్క రంగులతో, రకరకాల వెరైటీలతో బతుకమ్మ చీరలు నేయించి సీఎం కేసీఆర్ ఆడపడచులకు కానుకగా ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అభ్యర్దులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికి ముందుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షాలు తెలియజేశారు.