పార్లమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు…

119
prashanth rreddy

పార్లమెంట్ గైడ్ లైన్స్ ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, అధికారుల‌తో శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డితో పాటు చీఫ్ విప్‌లు స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి….కరోనా వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా శాస‌న‌స‌భ‌లో కొత్త‌గా 40 సీట్లు, మండ‌లిలో కొత్త‌గా 8 సీట్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. పార్ల‌మెంట్ ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. శాస‌న‌స‌భ‌, మండ‌లిలో రెండు చొప్పున అంబులెన్సుల‌తో పాటు పీపీఈ కిట్లు, ర్యాపిడ్ కిట్లు, ఆక్సీ మీట‌ర్లు అందుబాటులో ఉంచుతామ‌న్నారు.

శాస‌న‌స‌భ‌, మండ‌లి హాల్‌లో ఆరు అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. మార్ష‌ల్స్ రెండు రోజుల ముందే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలన్నారు. అసెంబ్లీ సెక్ర‌ట‌రీ ఆధ్వ‌ర్యంలో మీడియా సిబ్బందికి కొవిడ్ టెస్టులు నిర్వ‌హించేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి పేర్కొన్నారు.