ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ సెక్రటరీ గిరిధర్ అరమనేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి నూతన జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌కు ఉత్తరం వైపున బోయిన్‌పల్లి-మేడ్చల్ మధ్య, దక్షిణం వైపున ఉన్న శంషాబాద్- కొత్తూరు మధ్య రహదారులను మెరుగుపరిచే అంశం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వద్ద పెండింగ్‌లో ఉందని అమరనే కు తెలిపారు.
అలాగే కల్వకుర్తి-నంద్యాల మధ్య నూతన జాతీయ రహదారి ప్రాజెక్టు కు ఆమోదం తెలిపినందుకు కేంద్ర రోడ్డు రవాణా అండ్ హైవేస్ శాఖ మంత్రి గడ్కరీ, ఆశాఖ సెక్రటరీ గిరిధర్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ లను సందర్శించారు. తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం నేపథ్యంలో అక్కడి నిర్మాణాల్లో ఉపయోగించిన స్టోన్స్ ను పరిశీలించారు. మంత్రి వేముల బృందంలో ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈ.ఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్,షాపూర్ జి సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ పలువురు అధికారులు ఉన్నారు.