వ్యవసాయ శాఖలో ఏఈఓల నియామకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయమే తెలంగాణ తొలి ప్రాధాన్యం అన్నారు. రైతులకు వ్యవసాయంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం. వ్యవసాయ శాఖలో 2638 ఏఈఓ పోస్టులకు గాను 2444 మంది విధులలో ఉన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం అమలు కోసం మిగిలిన 194 క్లస్టర్లలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈఓల భర్తీకి ఆదేశాలు జారీచేయడం జరిగింది అన్నారు మంత్రి.
రెగ్యులర్ ప్రాతిపదికన అధికారులను నియమించే వరకు క్షేత్రస్థాయులో రైతులకు ఇబ్బందులు రాకుండా వీరిని నియమించడం జరుగుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 2167 ఏఈఓలను, నూతన మండలాల ఏర్పాటు నేపథ్యంలో 114 ఏఓలను నియమించడం జరిగింది. రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ సలహాలు అందాలి. తెలంగాణ ఏర్పడిన తరువాత సాగునీరు, ఉచిత కరంటుతో పాటు రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోలుతో రైతులలో ఆత్మవిశ్వాసం నింపిందని మంత్రి తెలిపారు.
ఆరేళ్లలో దేశానికి దిక్సూచిలా నిలిచే నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. వ్యవసాయానికి ఊతమిచ్చే చర్యలు తెలంగాణ మాదిరి ఏ రాష్ట్రంలోనూ తీసుకోవడం లేదు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలుతో రైతును మరింత ఉన్నత స్థితిలో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం. అందుకే అదేశాలిచ్చిన 24 గంటలలో నియామకాలకు జీఓ విడుదల చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.