తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాజేంద్రనగర్ లో తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షాకేంద్రం ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి…అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం ఏర్పాటుచేశామన్నారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకం అన్నారు. వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికం అన్నారు.ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ ఎ ఓ వెల్లడించిందని తెలిపారు నిరంజన్ రెడ్డి.
మన కీర్తి పెరగడం తెలంగాణకు గర్వకారణం…హైదరాబాద్ ను చూసి గర్వపడే పరిస్థితి కేసీఆర్ కల్పించారన్నారు. సీఎం ముందుచూపుతో ఐటీ రంగంలో తెలంగాణ ముందుందని…ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎగబాకినం అని తెలిపిన నిరంజన్ రెడ్డి…విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నాం అన్నారు. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాం అన్నారు.
కాళేశ్వరం ద్వారా ఏటి ఏరును ఎదురెక్కించి మల్లన్న సాగర్ ను నింపిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. కోటి ఎకరాలకు పైగా తెలంగాణలో భూములు సాగవుతున్నాయి…పత్తి సగటు దిగుబడిలో దేశంలో అగ్రభాగంలో ఉన్నాం అన్నారు. వరి దిగుబడిలో పంజాబ్ ను తలదన్నినం అని తెలిపిన నిరంజన్ రెడ్డి…ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో విత్తనరంగం మీద దృష్టి సాధించడం జరిగిందని..ప్రపంచంలో 70,80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు. విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలన్నారు. విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్ వినియోగం మరింత పెరుగుతుందన్నారు.