రైతులను ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించాలి- మంత్రి నిరంజన్‌ రెడ్డి

104
- Advertisement -

హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) బిజినెస్ సమ్మిట్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో జరిపినందుకు కేంద్రానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమ్మిట్‌లో ఆయన తెలంగాణ డిమాండ్లపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వాగ్దానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కన్నా ముందే తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులేశామన్నారు. 2014-2015 లో 122 లక్షల ఎకరాలు ఉన్న సాగు 2020-21 కి 203 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014-2015 లో 68.2 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం దిగుబడి 2020-21కి 259.2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. సాగు నీటి వసతిని పెంచడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు పెరిగిందని మంత్రి తెలిపారు.

రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున.. ఏడాదికి రెండు సార్లు ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఎనిమిది విడతలలో రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతున్నది. కేంద్రం వంటనూనెల దిగుమతి కోసం ఏటా రూ.లక్ష కోట్లు వెచ్చిస్తున్న పరిస్థితిని అంచనా వేసి తెలంగాణ ఆయిల్ పామ్ వైపు దృష్టి సారించింది. పామాయిల్ దేశీయ డిమాండ్ కు తగినట్లుగా ఉత్పత్తి సాధించాలంటే దేశంలో ఇంకా 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలి. తెలంగాణలో ఆయిల్ పామ్ గెలలు అత్యధిక నూనె ఉత్పత్తి శాతం కలిగిఉన్నవి.. దేశంలో అత్యధికంగా 19.22 శాతం నూనె ఉత్పత్తి అవుతుందన్నారు.

ఈ పథకం కింద రాబోయే ఐదేళ్లలో కేంద్రం 1.12 లక్షల ఎకరాలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న అయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) కింద ఆమోదించి నిధులు కేటాయించాలి. ఆయిల్ ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (FFB) ధర టన్నుకు రూ.15000 కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి రైతులను ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించాలి. ఆయిల్ పామ్ సాగుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి కోరారు.

- Advertisement -