మోడీ రైతాంగానికి చేసింది సున్నా:నిరంజన్ రెడ్డి

68
minister Niranjan Reddy
- Advertisement -

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..”రైతుబంధు తొలిరోజు 19.98 లక్షల మంది రైతులకు చెందిన 11.73 లక్షల ఎకరాలకు గాను రూ.586.65 కోట్లు జమ అయ్యాయి. రైతుబంధు రెండో రోజు 16.32 లక్షల మంది రైతులకు చెందిన 24.68 లక్షల ఎకరాలకు రూ.1234.10 కోట్లు జమ అయ్యాయి. ఈ రెండు రోజులలో మొత్తంగా 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు గాను రూ.1820.75 కోట్లు జమ అయ్యాయి. రైతుబంధుపై దురభిప్రాయాలు ప్రచారం చేస్తున్నారు. 10 ఎకరాల లోపు రైతులకు సింహభాగం రైతుబంధు నిధులు అందుతున్నాయి. 92.5 శాతం చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు నిధులు అందుతున్నాయి. గత ఎనిమిది విడతలలో రూ.50.448 కోట్లు సాయం అందించగా, తొమ్మిదవ విడతలో 65 లక్షల మందికి రూ.7508 కోట్లు అందనున్నాయి. మొత్తం రైతుబంధుకు అర్హులు 68.10 లక్షల మంది తేలారు. రాష్ట్రంలో దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందుతున్నది” అని పేర్కొన్నారు.

“మోడీ భారత రైతాంగానికి చేసింది సున్నా..రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతుల పెట్టుబడి ఖర్చులు మాత్రం రెట్టింపు చేశారు. సీ2+50 అమలు చేస్తామని ఎ2+ 50 అమలు చేస్తూ రైతులను మోసం చేసి స్వామినాధన్ సిఫార్సులను అవమానిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుల పోరాటంతో తోకముడిచి రైతులకు క్షమాపణ చెప్పారు. 60 ఏండ్లు నిండిన వారికి ఫించను ఇస్తామని దాని ఊసెత్తడం లేదు. రైతులకు ఏదో చేస్తామని చెప్పి చెయ్యకపోగా నిస్సిగ్గుగా దబాయిస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన నుండి గుజరాత్ పలు రాష్ట్రాలు వైదొలిగాయి. దీని అమలులో చెల్లించే ప్రీమియం ఎక్కువ .. రైతులకు చెల్లించే పరిహారం తక్కువ .. దీనిని నేను స్వయంగా శాసనసభలో వివరించాను. అదే ఫసల్ భీమా యోజన ప్రధాని సొంత రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు? ” అని ప్రశ్నించారు.

బెంగాల్ లో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తాం .. రైతులకు న్యాయం జరిగేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టమంటున్నారు .. యూపీలో వస్తున్న బిల్లులు చూసి ఈ విధానానికి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కొర్రీలు పెడ్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో ఆరు కోట్ల ఎకరాల సాగు అనువైన భూమి ఉన్నది. ఇక్కడ మొత్తం బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది గత మూడేళ్లుగా 4 నుండి 4.5 శాతమే. గుజరాత్ లో 2.50 కోట్ల ఎకరాల సాగు అనువైన భూమి ఉండగా అక్కడి బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు గత మూడేళ్లలో 1.7 శాతం నుండి 2.8 శాతం మాత్రమే కేటాయించారు. అస్సాంలో 70 లక్షల ఎకరాల సాగు అనువైన భూమి ఉండగా  అక్కడి బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు గత మూడేళ్లలో 4.5 శాతం నుండి 5.20 శాతం మాత్రమే కేటాయించారు అని తెలిపారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయిస్తున్న బడ్జెట్ జాతీయ సగటు 6 నుండి 6.50 శాతం .. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కనీసం జాతీయ సగటు కూడా అమలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 11.50 శాతం నుండి 12 శాతం బడ్జెట్ కేటాయించడం జరుగుతున్నది. దీనిని బట్టి ఎవరు రైతుల పక్షం ? ఎవరు కార్పోరేట్ల పక్షం అన్నది అర్ధమవుతున్నది, అని వివరించారు.

అబద్దపు మాటలతో ప్రజలను కేంద్రం మోసం చేస్తున్నది, ఎన్నిసార్లు అంకెలతో సహా సమాధానం చెప్పినా బీజేపీ నేతలు పాత అబద్దాలు వల్లె వేస్తున్నారు. 13 వ ఫైనాన్స్ కమీషన్ కింద కేంద్రం నుండి రూ.1129.93 కోట్లు రావాల్సి ఉంది. 14వ పైనాన్స్ కమీషన్ నుండి రూ.817.61 కోట్లు,15వ ఫైనాన్స్ కమీషన్ నుండి రూ.1103.70 కోట్లు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద వెనకబడిన ప్రాంతాల ప్రాతిపదికన రూ.1350 కోట్లు రావాల్సి ఉన్నది. జీఎస్టీ కింద 2020 – 21 బకాయిలు రూ.1074 కోట్లు, 2021 – 22 బకాయిలు రూ.1174 కోట్లు మొత్తం 2247 కోట్లు రావాల్సి ఉన్నది. సీఎస్ఎస్ బకాయిలు తెలంగాణ ఆంధ్రకు రూ.454 కోట్లు బదలాయించింది. ఈ నిధులు కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సి ఉన్నది. అన్నీ కలిపి కేంద్రం నుండి మొత్తం రూ.7183.71 కోట్లు రావాల్సి ఉన్నది కాని వచ్చింది ఎంత?…తెలంగాణ నుండి ఏడేళ్లలో రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో వెళ్లగా కేంద్రం నుండి తిరిగి వచ్చినవి రూ.1,68,647 కోట్లు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2013 – 14 లో రూ.57,258 కోట్లు, ఐటీ ఉద్యోగులు 3.23 లక్షలు, 2021 – 22లో ఐటీ ఎగుమతులు రూ.1,83,569 కోట్లు, ఐటీ ఉద్యోగులు 7.78 లక్షలకు పెరిగారని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిదేళ్లలో ఆసరా ఫించన్ల కింద తెలంగాణ ప్రభుత్వం వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృత్తి కార్మికులకు రూ.48,273 కోట్లు పంపిణీ అయ్యాయి. ఇందులో ఈ ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1645 కోట్లు మాత్రమే. కేవలం 1645 కోట్లు ఇచ్చింది అందులో మా వాటా ఉంది అని  చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా ? అని ప్రశ్నించారు.

మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతున్నది. 1991 లో 5.5 శాతం, 1998 లో 5.7 శాతం, 2014లో 5.6 శాతం, 2021లో 7.1 శాతం ఉంటే 2022 CMIE తాజా గణాంకాల ప్రకారం 7.4 శాతం ఉన్నది. ప్రజాస్వామ్య సూచీలో భారత్ 2014లో 56వ స్థానం. 2021లో 93వ స్థానానికి చేరింది. మానవాభివృద్ది సూచీలో 2014లో 80వ స్థానం నుండి 2021లో 131వ స్థానానికి, వ్యక్తిగత హక్కులు – 2014లో 85వ స్థానం నుండి 2021లో 119వ స్థానానికి, పత్రికాస్వేచ్చ – 2014లో 131వ స్థానం నుండి 2021లో 142వ స్థానానికి, పౌరహక్కుల సూచీలో – 2014లో 133వ స్థానం నుండి 2021లో 148వ స్థానానికి, ఆకలిసూచీ – 2014లో 63వ స్థానం నుండి 2021లో 101వ స్థానానికి చేర్చారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎనిమిదేళ్లలో రెట్టింపు అయ్యాయి. మోడీ పాలనలో ఎనిమిదేళ్లలో ముగ్గురు ఆర్ బి ఐ గవర్నర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రతిష్టాత్మకంగా మోడీ దేశంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు ఏర్పాటు చేసుకున్న నీతి అయోగ్ వైస్ చైర్మన్లు ఇద్దరు రాజీనామా చేశారు. ప్రధాన ఆర్థిక సలహాదారు ఒకరు, సాక్షాత్తు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు ఒకరు, సభ్యులు ఒకరు తమ పదవులకు రాజీనామా చేశారు. కరోనా విపత్తులో ఇద్దరు వైరాలజిస్టులు రాజీనామ చేశారు.

ఈ పరిణామాలు దేనికి సూచికలు ? ఈ వివరాలన్నీ ప్రజల జీవితాలలో పెనవెసుకున్న అంశాలు. దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంత మంచిగున్న చోట కుంపటికి బీజేపీ ఆలోచనలు చేస్తుంది. ప్రభుత్వాలను కూల్చే కేంద్ర రాజకీయాలు ఏడు దశాబ్దాలలో ఎన్నడూ లేదు. కాంగ్రెస్ చెడు రాజకీయాలు చేసేందుకు ఏడు దశాబ్దాలు పట్టింది. ఎనిమిదేళ్లలోనే ప్రజలు ఏవగించుకునేలా బీజేపీ రాజకీయాలు చేస్తున్నది. రైతుబంధు పథకాన్ని దేశమంతటా అమలుచేయండి..ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి..రైతుల మోటర్లకు మీటర్లు బిగించడం ఆపేయండి..చేతనైతే రైతులకు మేలు చేయండి. నైతికత ఉంటే తెలంగాణ బకాయిలు వెంటనే చెల్లించాలి” అని తెలిపారు.

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డితో పాటుగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీడ్స్ ఎండీ కేశవులు హాజరయ్యారు.

- Advertisement -