మోడీ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోంది- మంత్రి

210
niranjan reddy
- Advertisement -

ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై కేంద్రప్రభుత్వ దమనకాండను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తరపున నిరసన తెలుపుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం కేంద్ర ప్రభుత్వ రైతాంగ విధానాలు, రైతులపై కేంద్రం దమనకాండపై మంత్రి నిరంజన్ రెడ్డి నిరసన ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం కార్పోరేట్లకు కాదు కర్షకుల రుణాలు మాఫీ చేయండి. పంజాబ్, హర్యానా రైతులు తమ బాధలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఛలో ఢిల్లీ పిలుపును ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఢిల్లీ పోలీసులు రైతాంగాన్ని ఢిల్లీ రానీయకుండా ఇనుప కంచె వేసి, తీవ్రమైన చలి ఉన్న సమయంలో భారత దేశ వెన్నెముక అయిన రైతులపై చన్నీళ్ళు, భాష్పవాయువులు ప్రయోగించడం భారత జాతికే అవమానకరం అని మంత్రి మండిపడ్డారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండీ రైతాంగం యొక్క సమస్యలు పట్టించుకోకపోగా, కొత్త చట్టాలతో మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పంజాబ్ హర్యానాకు సంబంధించి రైతుల డిమాండ్లు ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు. 1. ఎలక్ట్రిసిటీ బిల్ కేంద్రం ఉపసంహరించుకోవాలి. (రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానానికి చరమ గీతం పాడే విధంగా ఈ విద్యుత్ బిల్లు లు ఉండడం రైతాంగాన్ని కలవర పెడుతోంది). 2. కేంద్రం ఇటీవల పాస్ చేసిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలి. (MSP ప్రస్తావన బిల్లు ల్లో లేక పోవడం, APMC ల ను నిర్విర్యం చేయడం , కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడం వలన రైతులు అభద్రత కు లోనవుతున్నారు) అని మంత్రి తెలిపారు.

2017లో తమిళనాడు రైతులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 40 రోజులకు పైగా పుర్రెలతో వినూత్నరీతిలో రుణాల మాఫీ, కరువు ప్యాకేజీ, కావేరీ నది నీటి సమస్యలు మొదలగు డిమాండ్లతో ఆందోళన చేస్తే బీజేపీ ప్రభుత్వం వాళ్ళను ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో రైతులు దుఖిస్తూ వెనుదిరిగారు. దాని పలితం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మరియు దాని మిత్ర పక్షం AIADMK ఓటమి చవి చూసింది. 2017 లో మధ్య ప్రదేశ్ లోని అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులు తమ హక్కుల కొరకు పోరాటం చేస్తున్నప్పుడు విచక్షణారహితంగా కాల్పులు జరుపుగా 6 గురు రైతులు మరణించిన పలితం బీజేపీ 2018 లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో చవి చూసింది. 2018 లో మహారాష్ట్ర రైతాంగం తమ సమస్యల సాధనకై కిసాన్ లాంగ్ మార్చ్ నిర్వహించిన పాదయాత్ర మూలంగా రైతుల కాళ్లపై వచ్చిన పుళ్ళు ఇంకా భారత దేశ ప్రజల కళ్లల్లో మెదులుతున్నాయని మంత్రి గుర్తు చేశారు.

ఇప్పుడు రైతాంగానికి ఎలాంటి భరోసా ఇవ్వకుండానే రైతుల పుట్టి ముంచే చట్టాలు ముందుకు తెచ్చారు. ఇప్పటి వరకు రైతులకు కేంద్రం చేసిందేంటి ? దేశంలోని 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా రైతుబంధు, రైతుభీమా పథకాలు ఉన్నాయా ?.. 2014 నుండి దేశంలో ఏఏ రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ? ఎంత మంది రైతులు చనిపోయారు ?..వారికి కేంద్రం గానీ, ఆయా రాష్ట్రాలు గానీ చేసిన సాయమెంత ? దాని మీద దమ్ముంటే కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలి ? అని మంత్రి సవాల్‌ చేశారు.

తెలంగాణ ఆవిర్భావం తరువాత రైతు రుణమాఫీ, రైతు బంధు, 24 గంటలు ఉచిత విద్యుత్తు, మార్కెట్ యార్డ్ ల ఆధునీకరణ, గోడౌన్ ల సామర్థ్యం పెంచడం, ఇరిగేషన్ ప్రోజెక్టుల ద్వారా నీటి లభ్యత పెంచడం, మిషన్ కాకతీయ ద్వారా నీటి లభ్యత ద్వారా 50 లక్షలపై చిలుకు ఉండే సాగు నేడు కోటి 40 లక్షల ఎకరాల మాగణగా తెలంగాణ అవతరించింది. కరోన మహమ్మారి సమయంలో రూ.30 వేల కోట్లతో మొత్తం పంటలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి నిజమైన రైతు బాంధవుడు కేసీఆర్ అని రైతులు భావించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రైతులను సంఘటిత పరిచేందుకు రైతు బంధు సమితి ఏర్పాటు, రైతు వేదికల నిర్మాణంతో కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షాన నిలబడింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.6 లక్షలు సాయం అందించింది, రైతుభీమా పథకం తీసుకువచ్చి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షలు ఆ రైతు కుటుంబానికి అందేలా చూస్తున్నది.

ఇప్పటి వరకు 39,541 మంది రైతులకు రూ.1977.05 కోట్లు చెల్లించడం జరిగింది.రైతుల లాభంకోసం వ్యవసాయ చట్టం అంటున్న మోడీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను గానీ, మోడీ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సిఫారసులను గానీ ఎందుకు పక్కన పెట్టింది ?..కొత్తచట్టంతో రైతులకు ఏ విధంగా లాభమో మోడీ బయటకు వచ్చి మీడియా ముందు ఎందుకు చెప్పరు? అని నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. రైతుభీమా, రైతుబంధు, కొత్త ప్రాజెక్టులు, నియంత్రిత వ్యవసాయ విధానంతో రైతులకు ఎలాంటి లాభమో కేసీఆర్ చెబుతున్నారు, చేసి చూయిస్తున్నారు. 1990 లో వీపి సింగ్ ప్రభుత్వంలో స్వయంగా రైతు అయిన ఉప ప్రధాని దేవిలాల్ అప్పట్లోనే రూ.10 వేలు చొప్పున దేశంలోని రైతుల రుణాలు మాఫీ చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్ రైతు కాబట్టే, వారి ఇబ్బందులు తెలుసు కాబట్టే ఇప్పటికి రెండు సార్లు రైతుల రుణాలు మాఫీ చేశారు. రైతుభీమా, రైతుబంధు పథకాలు పెట్టారు. సాగునీరు, ఉచిత కరంటు ఇస్తున్నారని మంత్రి కొనియాడారు.

మరి కార్పోరేట్లకు రూ.2.50 లక్షల కోట్ల రుణాలు మాఫీచేసిన మోడీ రైతులకు ఎందుకు మాఫీ చేయరు ?. దేశానికి దిక్సూచిలా కేసీఆర్ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఉన్నాయి. వ్యవసాయాన్ని దివాళా తీయించి కార్పోరేట్లు, ఆదాని , అంబానీలకు దోచిపెట్టే విధంగా కేంద్రప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. కరంటు, మార్కెట్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్యం లేకుండా చేసి కేంద్రం రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేయాలని చూస్తుంది. కార్పోరేట్ల మాయలో ఉన్న కేంద్రానికి కనీసం రైతులతో మాట్లాడే సమయం కూడా లేదు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదు. దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలను కేంద్రప్రభుత్వం గుర్తించి రైతుల డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ రైతాంగానికి మా సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -