పంట కొనుగోళ్ల పరిమితిలో కేంద్రం విధానం మారాలి..

69
Minister Niranjan Reddy

మద్దతు ధరకు పంటల కొనుగోళ్ల పరిమితిలో కేంద్రం విధానం మారాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో యాసంగి పంటలు, కొనుగోళ్లు, ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు, ప్రత్యామ్నాయ పంటలు, ఉత్తమ సాగు పద్దతులు తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానం మూలంగా సాగు, దిగుబడులు పెరుగుతున్నాయి. దానిని కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరం. మద్దతుధరకు కంది పంట కొనుగోలు పరిమితి పెంచాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రం 5 ఏళ్ల సగటు సాగును పరిగణనలోకి తీసుకుని దిగుబడిలో 25 శాతం పంటకే మద్దతు ధర వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని మంత్రి మండిపడ్డారు.

కేంద్రం ఈ ఏడాది తెలంగాణలో సాగయిన కంది పంట దిగుబడి పరిగణనలోకి తీసుకొని ఎం.ఎస్.పి పై కొనుగోలు చేయాలి. రైతులు పంటలు ఆపుకుని అమ్ముకునే రోజులు రావాలి.అప్పుడే రైతులకు మరిన్ని లాభాలు వస్తాయి. కందుల కొనుగోలుకు ముందస్తు కార్యాచరణ చేపట్టండి. నియంత్రిత సాగులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును గౌరవించి 10.80 లక్షల ఎకరాలలో కందులను సాగుచేశారు. వాతావరణం అనుకూలించి కంది పంట ఆశాజనకంగా ఉంది ..దిగుబడి పెరగనుంది. నారాయణపేట ప్రాంతంలో కంది పంట కోతలు కూడా మొదలయ్యాయి. వారాంతంలో నారాయణపేటలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్ ఫెడ్ కు ఆదేశాలు ఇచ్చామన్నారు.

యాసంగి ఎరువుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరు నెల యూరియా కోటా 4.88 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 4.22 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేయడం జరిగింది. మిగిలిన ఎరువులు సకాలంలో తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రయోగాత్మకంగా రైతులు బియ్యం పట్టించి సొంతంగా అమ్మడం అభినందనీయం. వారు మంచి లాభాలు పొందారు. హాజీపూర్ గ్రామం, హాజీపూర్ మండలం మంచిర్యాల జిల్లా రైతు పార్వతి లచ్చయ్యకు ఫోన్ చేసి మంత్రి అభినందించారు. మొబైల్ మిల్లింగ్ యంత్రాన్ని రైతుల ఇంటి వద్దకే తీసుకువెళ్లి మిల్లింగ్ చేయడం వల్ల రైతుల పంట మిల్లింగ్ కేంద్రానికి తరలించే శ్రమ తప్పించి రైతాంగానికి లాభం చేకూరింది. వరి ముడి సరుకు అమ్ముకోకుండా బియ్యం పట్టించి అదనపు విలువతో అమ్ముకుంటే రైతాంగానికి అధిక లాభాలు వస్తాయని మంత్రి అన్నారు.

ఈ మార్పు ఆహ్వానించదగింది. రైతులు ఇటువైపు అడుగులు వేయాలి, చైతన్యం చేయాలి. రెండు రకాల ధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1,888 వచ్చేలా చేసింది .. గతంలో మాదిరిగా రెండురకాల ధరలు లేకుండా ముందస్తుగా జాగ్రత్తపడి రైతులకు న్యాయం చేశాం. ధాన్యం కొనుగోళ్ల గురించి రైతులు ఆందోళన చెందొద్దని మొదటి నుండి విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మార్కెట్లో మద్దతుధరకు మించి రూ. 2,200 నుండి రూ. 2,400 వరకు ధర ధాన్యానికి దక్కుతుంది. ప్రతి ఒక్క రైతు వద్ద ఉన్న పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలుచేయడం జరుగుతుంది. రైతుల సౌకర్యార్దం, కరోనా పరిస్థితుల మరియు ఆయకట్టు పెరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్న 254 కొనుగోలు కేంద్రాలకు బదులు 300 పత్తి అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

గత సంవత్సరం ఇదే సమయానికి 6.39 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 10.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు చేశాం. క్షేత్రస్థాయిలో పూర్వపు జిల్లాల వారీగా జనవరి నుండి వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, రైతులు, రైతుబంధు సమితి సభ్యులకు అవగాహనా సదస్సులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.భాస్కరా చారి, ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రాములు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.