రాహుల్ గాంధీకి మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ..

70
Minister Niranjan reddy
- Advertisement -

తెలంగాణ పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలపాటు నాటి కాంగ్రెస్ పార్టీ పాలన పాప ఫలితమే కదా వ్యవసాయరంగ దయనీయస్థితి. కాంగ్రెస్ పార్టీ అంతులేని వైఫల్యాల చరిత్రను ఒక్క లేఖలోనో.. ఒక్క మాటలోనో చెప్పడం సాధ్యంకాదు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడచూసినా రైతన్నల మరణమృదంగ విషాదమే కాదా? NCRB లెక్కల ప్రకారమే 1,58,117 రైతులు అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకున్న విషయం వాస్తవం కాదా?. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రైతాంగానికి ఒరిగింది శూన్యం.. నిలకడలేని కరంటు, అర్ధరాత్రి కరెంట్ తో అనేక మంది పాముకాటుకు, కరంటుషాక్ లకు గురైన వేలమంది మరణించింది నిజం కాదా ? పండించిన పంటను కొనమని, బకాయిలు అడిగిన ఎర్రజొన్న రైతులను కాల్చి చంపిన కర్కశ పాలన కాంగ్రెస్ ది కాదా ?

నాడు రైతులపైన తుపాకి తూటాలు పేల్చిన మీరు ఇయ్యాల రైతు సభలు పెడ్తరా…? ప్రభుత్వ భూములు పంచాలని, పేదలకు ఇంటి జాగాలు పంచాలని డిమాండ్ చేస్తూ జరిగిన ముదిగొండ ధర్నా మీద కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా ? అని మంత్రి ప్రశ్నించారు. బుల్లెట్లు కురిపించి రైతులను పొట్టన పెట్టుకున్న పాపానికి, ముందు క్షమాపణలు చెప్పండి అని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని నీచమైన రాజకీయాలు చేసిన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతారా.? రైతాంగాన్ని రక్తకన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అన్నదాత ఎన్నటికీ క్షమించడు అని దుయ్యాబట్టారు!.

వరిధాన్యం కొనుగోలుపై మోడీ సర్కారు మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతు ఆందోళనకు దిగినప్పుడు ఎక్కడ పడుకున్నారు. ఈ కాంగ్రెస్‌ నేతలు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తామని సభలు ఎందుకు పెట్టరు? వ్యవసాయం మీద, రైతుల కష్టాల మీద రాహుల్ గాంధీకి ఉన్న అవగాహన ఏంటి ? రాహుల్ గాంధీ వ్యవసాయం గురించి మాట్లాడటం అంటే అదొక వింత కాదా అని ఎద్దేవ చేశారు. కేవలం ఎనిమిదేళ్ల పాలనలో 58 ఏళ్ల అన్యాయాలను తుడిచిన ఘనత మా రైతు ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. వ్యవసాయరంగానికి సాగునీరు, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, కరంటు మౌళిక వసతుల కల్పన కోసం అన్నీ కలిపి ఈ ఎనిమిదేళ్లలో రూ.3 లక్షల 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుది.

ఈ దేశంలో రైతుకు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ ఎనిమిదేండ్లలో ఉచిత విద్యుత్ కోసం 87 వేల కోట్లకుపైగా ఖర్చు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే కదా ?. ఈ వెలుగులను కూడా ఓర్చుకోలేక మీ లోకల్ కాంగ్రెస్ నాయకులు 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలని కేంద్రానికి లేఖలు రాస్తూ రైతు ద్రోహానికి పాల్పడుతున్నారు. భవిష్యత్‌లో రైతుకు కరెంట్ కష్టమే రానివ్వకుండా కాపాడే యాదాద్రి థర్మల్ ప్లాంట్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూసేస్తామని మీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రకటనలు చేస్తున్నారు. దీనికి మీరు ఏం చెబుతారు..? దేశ చరిత్రలో అత్యధిక కాలం అటు కేంద్రంలో… దశాబ్దాల పాటు ఇటు రాష్ట్రాల్లో అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ… ఆ తర్వాత వచ్చిన బిజెపి పార్టీల అసమర్థ విధానాల వల్లనే ఈ రోజు దేశం ఈ దుస్థితిలో ఉన్నది.

ముఖ్యంగా అర్ధ శతాబ్దానికి పైగా కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ అనేక రంగాల్లో ఇండియాను అగ్రస్థానంలో నిలిపే అవకాశాలను జారవిడిచి… అన్ని రంగాలను దిగజార్చింది. తెలంగాణ ప్రాంతానికి 60 ఏండ్లు కాంగ్రెస్ చేసిన ద్రోహాలను తట్టుకుని ప్రజల ఆకాంక్షలు, పోరాటాలకు అండగా నిలిచి, అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పరిపాలనతో పరిఢవిల్లుతున్నది. ఈ రోజు తెలంగాణ విధానాలను దేశం స్వాగతిస్తూ, స్వీకరిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయరంగంలో చేపట్టిన విప్లవాత్మకమైన కార్యక్రమాలను దేశం ఆదర్శంగా తీసుకుంటున్నది.

అన్నదాత ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయల ఆర్థికసాయం చేసే కుటుంబాలను రోడ్డున పడకుండా ఆదుకునే రైతు భీమా తీసుకొచ్చిన మా మానవీయ పాలన ఎక్కడ..? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వకుండా ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ. తిప్పుకున్న మీ క్రూరమైన పాలన ఎక్కడ..? 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించడం చేతగాలేదు. 70వేల టిఎంసీల నీళ్లతో పొంగిపొర్లే జీవనదులున్నా, సగం కూడా వాడుకోలేక కరువు కాటకాలకు కారణమైన తెలివి తక్కువ, అసమర్థ పార్టీ మీది కాదా? ఇలాంటి పరిస్థితులలో రైతు సంఘర్షణ సభ పేరుతో తెలంగాణలో రాజకీయం చేసేందుకు వస్తున్న రాహుల్ గాంధీ పై అంశాలపైన తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బహిరంగలేఖ ద్వారా డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -