బీజేపీ నేతల దీక్షలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణలో మాదిరిగా పంట కొనుగోళ్లు జరుగుతున్నాయని నిరూపిస్తారా ?. పిడుగులు పడడం, వర్షాలు రావడం ప్రకృతిపరంగా జరుగుతున్నదే.. అది ప్రకృతి సహజం.. అది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. ఈ విషయంలో రైతులకు ఉన్న స్పష్టత బీజేపీ నేతలకు లేకపోవడం విచారకరం అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పిడుగుల మీద వితండవాదం చేయడం బీజేపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
12,500 గ్రామపంచాయతీలకు పంటల సాగును పరిగణనలోకి తీసుకొని 7077 ధాన్యం, 1027 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదించాం.5187 ధాన్యం, 923 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. పంటల కోతలను బట్టి కొనుగోలుకేంద్రాలను పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. పిడుగులు, అకాలవర్షాలకు రైతులు రైతులు ఇబ్బందిపడడం అనేది విచారకరం.. దానిని రాజకీయం చేయడం బాధాకరం. చనిపోయిన రైతు కుటుంబానికి భీమా సొమ్ము అందించడం జరిగింది.. తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొనడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో గత ఆరేళ్లలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్ధ్యం 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. సాగునీటి రాకతో సాగువిస్తీర్ణం పెరుగుతుందని కొనుగోలు కేంద్రాలు పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల విషయంలో పూర్తి అవగాహనతో ఉంది. బీజేపీ నేతలు కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తే అదే వారు తెలంగాణకు చేసే పెద్దమేలు అని మంత్రి అన్నారు.
రైతుల పట్ల మీకు ప్రేమ, బాధ్యత ఉంటే పసుపుబోర్డు సాధించండి.. మద్దతు ధరకు పండిన పూర్తి పంటల కొనుగోలుకు అనుమతులు సాధించుకుని రండి. సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో నైరాశ్యంలో ఉన్న తెలంగాణ రైతులలో ఆత్మవిశ్వాసం నింపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. అసలు తెలంగాణ తెచ్చుకున్నదే రైతుల సమస్యలను రూపుమాపేందుకు. తెలంగాణ రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకునే కేంద్రం ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్న విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి అని మంత్రి తెలిపారు.