తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శం..

183
minister niranjan reddy
- Advertisement -

మూడు రోజుల కర్ణాటక పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ ఉద్యాన ప్రతినిధి బృందంతో బెంగుళూరు హెసరగట్ట ఐకార్ – ఐఐహెచ్ఆర్ పరిశోధనా కేంద్రంలో ప్రిన్స్ పల్ సైటింస్టులు, ముఖ్యులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ దేశమూ నాణ్యమైన ఆహారోత్పత్తిపై దృష్టి సారించడం లేదు. ఆ రంగంలో దృష్టిసారిస్తే భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఉద్యాన సాగులో పరస్పర సహకారం అవసరం అన్నారు. తెలంగాణ, కర్ణాటకల నేలలు, వాతావరణ పరిస్థితులు దాదాపు సమానంగా ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ రైతులకు అత్మవిశ్వాసం కల్పించడంతో పాటు ఆత్మగౌరవం పెంపొందించే చర్యలు చేపట్టారు. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు పథకాలతో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతుకు భరోసానిచ్చారు.పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టులతో సాగునీటి రాకతో రైతాంగంలో ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం బలపడిందని మంత్రి తెలిపారు.

సాగునీటి రాకతో రైతులకు మేలు జరగడమే కాదు.. పర్యావరణానికి ఎనలేని మేలు చేకూరింది.తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శం.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి మూడు సార్లు రూ.2 వేల చొప్పున మొత్తానికి రైతులకు ఇచ్చేది రూ. 6 వేలు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు సాయం చేస్తుంది. రైతు వేదికల నిర్మాణంతో తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి అన్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రపంచంలోని పలు దేశాల ఉద్యాన పంటల సాగును అధ్యయనం చేస్తున్నాం. భవిష్యత్‌లో తెలంగాణలో ఉద్యానపంటల సాగు పెంచడమే కాకుండా ఎగుమతుల మీద దృష్టిసారిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

తెలంగాణలో ఆలుగడ్డ సాగు పెంచాలని నిర్ణయించాం దానికి మీ సహకారం కావాలి. విత్తనపంటల మీద దృష్టి సారించి ఆ దిశగా రైతులను చైతన్యం చేస్తున్నాం. దైనందిన జీవితంలో ప్రజలు పండ్ల వాడకం ఆశించినంతగా భుజించడం లేదు.రాబోయే తరాలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దామని మంత్రి అన్నారు. మన దగ్గర పండేది, ఇతర చోట్ల పండనిది, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వాటి సాగుకు మొగ్గుచూపాలి. విశ్వవిద్యాలయాల పరిశోధనలు మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా సాగాలి. రైతులు ఉల్లి విత్తనొత్పత్తిపై దృష్టిసారించాలి. ఔషధ, సుగంధ పంటలకు మార్కెట్లో ఆదరణ ఉంది. దాని దిశగా పరిశోధనలు జరగాలని మంత్రి పేర్కొన్నారు.

గుజరాత్, హర్యాన రాష్ట్రాలు, స్పెయిన్, ఇజ్రాయిల్, న్యూజిలాండ్ సందర్శించి ఆయా రాష్ట్రాల్లో పంటలపై అధ్యయనం చేస్తున్నామని.. ఐకార్ – ఐఐహెచ్ఆర్ పరిశోధనా కేంద్రంలో బీర, చిక్కుడు, క్యారట్, మిరప, టమాటా, ముల్లంగి పంటల సాగు పరిశీలించారు మంత్రి. అనంతరం మొబైల్ కూరగాయల విక్రయ వాహనాలను పరిశీలించి.. తెలంగాణలో యువతకు ఈ వాహనాలతో ఉపాధి కల్పించే అంశాలను పరిశీలించాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, కెఎం పరాశివమూర్తి, హెసరగట్ట ఐకార్ డైరెక్టర్ దినేష్, వివిధ విభాగాల అధిపతులు, ప్రిన్స్ పల్ సైంటిస్టులు కేఎస్ శివశంకర, టీఎస్ అఘోరా, సీకే నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -