58.07 లక్షల రైతుల ఖాతాల్లోకి రైతు బంధు

146
niranjan
- Advertisement -

ఇప్పటివరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమయ్యాయని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుల పక్షాల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన నిరంజన్ రెడ్డి… 132.65 లక్షల ఎకరాలకు గాను రూ.6632.74 కోట్లు జమ అయ్యాయని చెప్పారు. పదెకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి నేరుగా నిధులు జమచేశామన్నారు.

అత్యధికంగా నల్గొండలో 4,31,660 మంది రైతుల ఖాతాలలోకి రూ.530.07 కోట్లు జమ అయ్యాయని తెలిపిన నిరంజన్ రెడ్డి… కనిష్టంగా మేడ్చల్ జిల్లాలో 29,685 మంది రైతుల ఖాతాలలోకి రూ.26.82 కోట్లు జమ అయ్యాయన్నారు. నల్లగొండ తరువాత స్థానాలలో ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అత్యధికంగా లబ్దిదారులు ఉన్నారని చెప్పారు. లక్ష లోపు లబ్దిదారులు ఉన్న జిల్లాలు మేడ్చల్, ములుగు, వరంగల్ అర్బన్ అన్నారు.

రైతులు తక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో నల్లగొండ తర్వాత ఎక్కువ నిధులు నాగర్ కర్నూలు జిల్లాకే వచ్చాయన్నారు. 2,52,958 మంది రైతుల ఖాతాలలో రూ.327.13 కోట్లు జమ చేశామన్నారు. అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అందుకే కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయం అందించామన్నారు. మరో మూడు, నాలుగు రోజులలో మిగిలిన రైతుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

- Advertisement -