రైతుబంధుపై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని..ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు, తాత్కాలిక లబ్ది కోసం కొందరు దుర్మార్గుల కుట్రలు చేస్తున్నారని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధుపై ఎవరు దుష్ప్రచారం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని వ్యవసాయ శాఖ నుండి కోరడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్దిని, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరు. కరోనా విపత్తు సమయంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల జీతాలలో కోత విధించి రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడం జరిగింది. అంతటి గొప్పతనం కేసీఆర్ గారిది.. కేసీఆర్ ఉన్నంత వరకు, అధికారంలో ఉన్నంత వరకు రైతుబంధు ఆగదని శాసనసభలోనే ప్రకటించారు అని మంత్రి పేర్కొన్నారు.
కుట్రదారులు, ద్రోహబుద్ది కలిగిన వారు ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేసేందుకు చేసే ప్రయత్నాలు చూసి ఎవరూ ఆందోళనకు గురి కావద్దు. రైతుబంధు యధావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర రైతాంగానికి హామీ ఇస్తున్నాను అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.