ఆయిల్ పామ్ సాగు ఉదృతం చేయాలి- నిరంజన్ రెడ్డి

169
Minister Niranjan Reddy
- Advertisement -

ఆయిల్ పామ్ సాగు ఉదృతం చేయాలి. ఒక ఎకరా ఆయిల్ పామ్ సాగు చేయుటకు మొదటి నాలుగు సం. కు గాను సుమారు రూ.1,38,680 /- వరకు (సూక్ష్మ సేధ్యం తో కలిపి) ఖర్చు వస్తుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్‌ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం గురించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగులో రూ.31,832/- వరకు ప్రభుత్వం ద్వారా రాయితీ లభిస్తుంది. మన దేశ జనాభాకు (22) మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం కాగా, కేవలం (7) మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన (15) మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నామన్నారు.

దేశంలో ప్రస్తుతం ఆయిల్ పామ్8.25 లక్షల ఎకరాలలో సాగులో జరుగుతుంది. దీని ద్వారా ఏడాదికి 16.85 లక్షల మెట్రిక్ టన్నుల గెలలు మరియు 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. పామ్ ఆయిల్ దిగుమతులను పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు వెచ్చిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలంటే, ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరమ కాగా.. ప్రస్తుతం 38,000 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. ఈ కొరతను అధిగమించడానికి 2.50 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయాలి.

నూనె గింజల పంటల్లోకెల్ల పామాయిల్ ఎక్కువ దిగుబడినిస్తూ (ఎకరానికి 10-12 టన్నుల గెలలు ),25-30 సం. వరకు సంవత్సరానికి సుమారు రూ.1,20,000/- నుండి రూ.1,50,000/- వరకు, ఆదాయంపొందవచ్చు మరియు పర్యావరణానికి మేలు కలిగించేదిగా పేరుగాంచింది. వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు.రాష్ట్రంలో పెరిగిన నీటీ వనరులు మరియు వాతావరణ అనుకూల పరిస్థితుల దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పామ్ ఆయిల్ సాగును చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 25 జిల్లాలలో,అనువైన 8.14 లక్షల ఎకరాల లో సాగుకు అనుమతించడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సహకార శాఖ GOMs నెం 60 తేదీ 16.12.2020 ద్వారా కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్ కేటాయింపు చేయడం జరిగింది.సదరు కంపెనీల వారు 06.01.2021 నాటికి ఉద్యాన శాఖకు సూచించిన ధరావతు చెల్లించి ఒప్పందం కుదుర్చుకోవలసి ఉన్నది. గుర్తించబడిన 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును రాబోయే 4 సం. ల లో ప్రాజెక్టు రూపంలో చేపట్టాలని ప్రతిపాదించడమైనది.

ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం గురించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగును మన రాష్ట్రం లో భారీగా చేపట్టనున్న నేపథ్యంలో అన్ని బ్యాంకుల వారు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు విరివిగా అందించాలని మంత్రి తెలిపారు. నాబార్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా ఆయిల్ పామ్ సాగు చేయబోయే రైతులకు అనుకూలంగా వుండేట్లుగా విధివిధానాలను రూపొందించి రైతులను ప్రోత్సహించాలి. ఆయిల్ పామ్ సాగుకు యూనిట్ ధరను నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మంత్రి ఆదేశించారు. రైతుకు అవసరమైన విధంగా యూనిట్ ధరలో పొందుపరచవలసిన అవసరం వుందని మంత్రి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ప్రవీణ్ రావ్ వీసీ పీజేటీఎస్‌ఏయూ, భగవాన్ డీఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం, కృష్ణ శర్మ ఎంజీ ఎస్‌బీఐ ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, నాబార్డ్ డీజీఎం సంతానం, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ ఓబుల్ రెడ్డి మరియు వివిధ 20 బ్యాంకుల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -