హీరో నాని, సిద్దార్ద్‌లకు మంత్రి నాని కౌంటర్..

70
- Advertisement -

టాలీవుడ్‌ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ మేరకు మంత్రికి టికెట్ రేట్లపై ప్రతి పాదనలు ఇచ్చారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందిపడకుండా సంఘాలు ఇచ్చిన వినతులను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సినిమా హాల్స్ లో పరిస్థితులు మెరుగుపర్చాలని సూచించాం సమయం ఇచ్చినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదని మంత్రి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ప్రతినిధులకు చెప్పారు. అందుకే సినిమా హాలులో తనిఖీలు ప్రారంభించామన్నారు. కొందరు ధియేటర్ల లైసెన్స్‌ లను రెన్యూవల్ చేసుకోకుండానే నడిపిస్తున్నారని చెప్పారు.అనుమతులు లేకుండా నడుపుతేున్న సినిమా థియేటర్లను సీజ్ చేసినట్టుగా తెలిపారు. రాష్ట్రంలోని 130 థియేటర్లను సీజ్ చేశామన్నారు మంత్రి.

ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 35 జీవోను జారీ చేసిందని మంత్రి గుర్తు చేశారు. అయితే ఎప్పుడో జీవో వస్తే ఇవాళ సినిమా థియేటర్లు మూయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎవరితోనైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సమస్యలేమిటో చెబితే వినడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.

సినిమా థియేటర్ కు వచ్చే రెవిన్యూ కంటే కిరాణా దుకాణానికి వచ్చే ఆదాయం ఎక్కువ అని హీరో నాని చేసిన కామెంట్స్ పై మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సినిమా థియేటర్‌కు వచ్చిన రెవిన్యూ, ఆ థియేటర్ పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వచ్చిన రెవిన్యూను లెక్క గట్టే హీరో నాని కామెంట్స్ చేసి ఉంటారని మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఏ ఊర్లోని సినిమా థియేటర్, కిరాణా దుకాణం రెవిన్యూను హీరో నాని లెక్కగట్టారో తనకు తెలియదన్నారు. హీరో నాని బాధ్యతాయుతంగానే మాట్లాడుతారని ఆయన చెప్పారు.

హీరో సిద్దార్ధ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మంత్రులు, లగ్జరీలను తగ్గించుకోవాలని మరో హీరో సిద్దార్ద్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. తాము కట్టే పన్నులతోనే మంత్రులు విలాసాలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా వ్యంగ్యంగా మంత్రి స్పందించారు.తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి హీరో సిద్దార్ద్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారేమోనన్నారు. హీరో సిద్దార్ధ్ చెన్నైలో ఉంటూ పన్నులు కట్టేది తమిళనాడులో కానీ ఏపీలో కాదన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంత్రులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారేమోనన్నారు. తాము విలాసంగా బతుకుతున్నామని హీరో సిద్దార్ధ్ ఏమైనా చూశారా అని మంత్రి ప్రశ్నించారు.

ఎవరితోనైనా ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య అయినా వినడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి ఎదో అపాదించి మాట్లాడటం ధర్మం కాదు అన్నారు. ఎవరో ఒకరి కోసం మేం చేస్తామ..సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్కరేనా అని అన్నారు.. గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం బామ్మర్ది తీసే సినిమాకి రాయితీ ఇచ్చారు. కానీ చిరంజీవి తీస్తే రాయితీ ఇవ్వలేదు.. కానీ సీఎం జగన్ అందరిని ఒకేలా చూస్తారని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -