రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఈ రోజు మేడ్చల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు సిబ్బందికి టీకాలు వేశారు. వారంలో నాలుగు రోజులు టీకా వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి,గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్,మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి,వైస్-చైర్మన్ రమేష్,స్థానిక కౌన్సిలర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రజలు అనుమానాలు పడొద్దు,అధైర్యపడొద్దు. మన దేశంలో వ్యాక్సిన్ కనుక్కోవడం అవి అందుబాటులోకి రావడం ఆనందకర విషయం. రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించుకున్నాం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని మంత్రి వెల్లడించారు.
కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారు. కరోనాను ఎదుర్కోవటంలో వైద్య సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేశారు. టీకాలు వేసుకున్నప్పటికీ మాస్కులు ధరించాలి, సామాజిక భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనాపై గట్టి పోరాటం చేశారు. వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.