హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబరేటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ఉందని తెలిపిన కేటీఆర్…ప్రతి సంవత్సరం ఆరు బిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఇక్కడి బయోటెక్ కంపెనీలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లాబరేటరీని ఏర్పాటు చేయాలని గతంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మరింత వేగంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా టెస్టింగ్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం తరఫున ఈ విధులను ఇక్కడి సంస్థ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో అటు పరిశ్రమలకి, ఇటు సంస్థకి ఉభయతారకంగా ఉండేలా నేషనల్ డ్రగ్ లేబరేటరీ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఈ రెండు విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని వెంటనే నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ లేఖలో వ్యక్తం చేశారు.