యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ..

123
ktr
- Advertisement -

రాష్ట్రంలో నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఆత్మీయ లేఖ రాశారు మంత్రి కేటీఆర్. మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుందున్నారు.

ఇప్పటిదాకా ఒక ఎత్తు.. ఇప్పుడు ఒకెత్తు అని.. యువత ప్రాణం పెట్టి చదివి తల్లిదండ్రులు, నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాన్ని సాకారం చేయాలని ఆకాంక్షించారు.వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.

ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో విజయవంతంగా పూర్తి చేశాం అన్నారు.

ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. అడ్డంకిగా వున్న రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించడంతో ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగపర్వం నడుస్తున్నది. సీఎం ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒక్కటే. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకండి. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టాలన్నారు. ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి…మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఓ సోదరుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లేఖలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -