ప్రముఖ దర్శక రచయిత దశరథ్ రాసిన ‘కథా రచన’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కే టీ ఆర్ ముఖ్య అతిధిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. వైభవంగా జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకులు వివి వినాయక్. హరీష్ శంకర్, నాగ్ అశ్విన్ అతిధులుగా పాల్గొన్నారు. వి ఎన్ ఆదిత్య, కాశీ విశ్వనాథ్, మహేష్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ఇష్టం. సినిమా అనే కాదు క్రియేటివ్ కంటెంట్, పుస్తకాలు, పేపర్లు చదవడం ఇష్టం. మంచి పుస్తకం కనిపిస్తే చదవాలనే ఆసక్తివుంటుంది. అలాగే మొదటి నుండి విజువల్ కంటెంట్ ఇష్టం. ఒక కథని చిత్ర రూపంలో మనసుని హత్తుకునేలా చెప్పడం ఒక గొప్ప నైపుణ్యం. కథని అలా చెప్పడానికి ఒక సామర్థ్యం కావాలి. అలాంటి సామర్థ్యం ఇలాంటి మంచి పుస్తకాలు చదవడం ద్వార వస్తుంది. ‘కథా రచన’ లాంటి అద్భుతమైన పుస్తకం వచ్చినపుడు మనం ప్రచురించాలని ముందుకు వచ్చిన భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి, మంత్రి శ్రీనివాస రావు గారికి అభినందనలు. ఇంత చక్కటి పుస్తకం రాసిన దశరథ్ గారికి ప్రత్యేమైన కృతజ్ఞతలు. ఒక సినిమా ప్రేక్షకుల మనసుని హత్తుకోవాలన్న, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నా, విజయం సాధించాలన్నా చక్కని స్క్రీన్ ప్లే, నేరేషన్, స్టొరీ టెల్లింగ్ కావాలి. ఈ విషయంలో దశరథ్ గారి ‘కథా రచన’ పుస్తకం ఔత్సాహికులకు ఉపయోగపడుతుంది నమ్ముతున్నాను. ఇంత చక్కటి పుస్తకాన్ని ప్రమోట్ చేసే భాద్యత అందరం తీసుకుందాం” అన్నారు
దశరథ్ మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్ గారి చేతులు మీదగా ఈ పుస్తక అవిష్కరణ జరగడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైన వివి వినాయక్. హరీష్ శంకర్, నాగ్ అశ్విన్ లు ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా వుంది. ఈ పుస్తకాన్ని చదివి చాలా ఇష్టపడి భాషా సాంస్కృతిక శాఖ ద్వార విడుదల చేయడానికి సహకరించిన మామిడి హరికృష్ణ గారికి, మంత్రి శ్రీనివాస రావు గారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని ముందు మాట రాసిన దర్శకుడు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. తెలుగులో మంచి స్క్రీన్ ప్లే పుస్తకం ఉండాలనే తపనతో దాదాపు 14 నెలలు శ్రమించి రాసిన పుస్తకం ఇది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఒక రచయిత, దర్శకుడు యూనిక్ గా ఎలా ముందుకు వెళ్ళాలనేది ఇందులో వుంటుంది” అన్నారు.
వివి వినాయక్ మాట్లాడుతూ.. కరోనా లాక్ డౌన్ లో ఎక్కువ పని చేసింది ఇద్దరే. సినిమా పరిశ్రమలో దశరథ్. ప్రభుత్వం తరపున కేటీఆర్ గారు. దశరథ్ ఎంతో ఫోకస్ గా హార్డ్ వర్క్ చేసి ఈ పుస్తకాన్ని పూర్తి చేశారు. చాలా తక్కువ పేజీల్లో ఎక్కువ సమాచారం అందించాడు. కథ రాసిన తర్వాత ఒక రియల్ చెక్ చేసుకోవడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. నా మిత్రుడు దశరథ్ కు మంచి పేరు వస్తుంది. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నాకు బాగా నచ్చిన రచయిత దశరథ్. ఒక పుస్తకం రాయడం మాములు విషయం కాదు. అంత సమయం కేటాయించి ఇంత చక్కటి పుస్తకం రాసిన దశరథ్ కి కృతజ్ఞతలు. భాషా సాంస్కృతిక శాఖ ద్వార ఈ పుస్తకం విడుదల కావడం గొప్ప విషయం. సినిమా మీద ఇలాంటి పుస్తకం రావడం మన అదృష్టం. ఈ పుస్తకం చాలా మందికి ఉపయోగపడుతుంది” అన్నారు.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. స్క్రీన్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలని చాలా మంది తపన పడతారు. కొంతమంది ఫిల్మ్ స్కూల్స్ కి వెళ్తారు. ఫిల్మ్ స్కూల్స్ వెళ్లి చదువుకునే అవకాశం లేని ఎంతోమందికి దశరథ్ గారి పుస్తకం ఉపయోగపాడుతుందని నమ్ముతున్నాను. చాలా విలువైన విషయాలు, అనుభవాలు ఇందులో పొందుపరిచారు. ఇలాంటి పుస్తకాలు ఆయన నుండి మరిన్ని రావాలి” అని కోరారు.
ఇవి కూడా చదవండి..