ఈరోజు తెలంగాణ ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాకతీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.1600 కోట్లతో నిర్మించే ఈ కిటెక్స్ వస్త్ర పరిశ్రమలో దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనున్నది. దీంతో వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కిటెక్స్ టెక్స్ టైల్స్ పరిశ్రమతో పరకాల నియోజకవర్గంలోని వేలాది మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. రైతులు కష్టమైనా, నష్టమైనా ఓర్చుకొని ఇబ్బందైనా తట్టుకొని భూములు ఇచ్చిన వారందరికీ పేరుపేరునా పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే చిన్న త్యాగం కాదు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చే రైతుల త్యాగాలు వెలకట్టలేనివి. వాళ్లకు మనం ఎంత చేసినా తక్కువనే. రుణం తీరదు. కొంత మంది నష్టపోతే చాలా మందికి లాభం జరుగుతుదని ఆలోచన చేసి, పెద్ద మనసుతో భూములు ఇస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలని చెప్పారు. కచ్చితంగా ఇస్తామని మాటిస్తున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పారిశ్రామికీకరణ వేగంగా జరగాలన్నారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ పిల్లల దుస్తులు తయారు చేసే సంస్థ కిటెక్స్ అని చెప్పారు. ఈ పరిశ్రమ నుంచి ఉత్పత్తి చేసిన బట్టలను దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కిటెక్స్ సంస్థ రూ. 3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు వారిని తెలంగాణకు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేసి తీసుకొచ్చాం. మీరు ఇక్కడ పెడితేనే వరంగల్ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పి కిటెక్స్ సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. రూ. 1600 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. 15 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. భారతదేశంలో ఇలాంటి టెక్స్ టైల్స్ పార్కు ఎక్కడా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.