రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్ వైపే నిలవబోతున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు, కార్యకర్తలు ఇవాళ తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కామారెడ్డిలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గంప గోవర్ధన్ గెలుపు ఖాయమని, కామారెడ్డిలో మళ్లీ ఈ సారి షబ్బీర్ అలీకి ఓటమి తప్పదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమి అడ్రస్ గల్లంతవుతుందని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీతోనే కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటుందని, కోదండరాం కూడా కాంగ్రెస్ మనిషైపోయిండని, ఎంత మంది వచ్చినా టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని, 100 సీట్లు గెలిచి మళ్లీ అధికారాన్ని చేపడతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని, తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను ఓడించాలని, కొన్ని అసెంబ్లీ సీట్లకోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టుపెట్టేందుకు మహాకూటమి వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మళ్లీ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడతారని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.