నల్లగొండకు మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు..

25

మంత్రి కేటీఆర్ శుక్రవారం నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ముందుగా నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, అనంతరం ఎస్సి ఎస్టీ వసతి గృహాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన భహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి రంగాన్నివిస్తరించి, ఐటీ ఫలాలు సామాన్య ప్రజలకు అందించేలా ప్రభుత్వం ముందుకుపోతున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము జోడెద్దుల్లా పరుగులు పెడుతున్నాయని..నెలనెలా నిధులను మంజూరు చేస్తూ పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధిని పరుగుపెట్టిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ వారి సంక్షేమానికి కృషిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలను మంజూరు చేసినట్లు తెలిపారు. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం, యాదాద్రి పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందేనని కేటీఆర్ వెల్లడించారు. టాస్క్ పేరిట నల్గొండలోనే విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించేలా సెంటర్ ఏర్పాటు చేసి వారికి అన్నివిధాలా ప్రోత్సాహకాలు అందిస్తామని కేటీఆర్ వివరించారు.

నల్లగొండలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో 5 బస్తి దవాఖానలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠ దామలను, కర్బస్తాన్ లను నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నల్లగొండలో కాంగ్రెస్ నాయకులు ఫ్లోరైడ్ ను పెంచిపోషించారని విమర్శించిన మంత్రి కేటీఆర్..భగీరథ పథకం వల్లనే ఫ్లోరైడ్ మహమ్మారి అంతం అయిందని.. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు పార్లమెంటులో సైతం ప్రస్తావించినట్లు కేటీఆర్ వివరించారు.