తెలంగాణ రాష్ట్రం లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా పేరు ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు.
లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫండ్ ను ఏర్పాటు చేయడం, జీనోమ్ వ్యాలీ లో ప్రత్యేకంగా ఒక ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకున్నదని, వీటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ బయో లైఫ్ సైన్సెస్ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.