బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు- మంత్రి కేటీఆర్‌

95
- Advertisement -

బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించే సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులు, యువకులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధిని పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రానికి బీజేపీ నేతలు చేసిన మంచి ఏముందని ప్రశ్నించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలను చేపట్టి ఏడేళ్లవుతోందని… అయినా ఇప్పటి వరకు తెలంగాణకు ఆయన చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన బీజేపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని చెప్పారు. తెలంగాణకు మోదీ ఎన్నో హామీలు ఇచ్చారని… ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఉపాధిహామీ పథకానికి 25 శాతం నిధులను తగ్గించారని అన్నారు.

ప్రజల జీవితాలను మార్చమంటే… జీవిత బీమా సంస్థలను అమ్మేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మళ్లీ ఏపీలో కలిపేస్తారని చెప్పారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ డైలాగులు చెప్పడం తప్ప దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్ కు మాత్రమే మోదీ ప్రధాని అని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, గంప గోవర్ధన్, జాజల సురేందర్, గణేష్ బిగాల, మొహమ్మద్ షకీల్ అమీర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -