ఫార్మా సంస్థలకు అనువుగా జీనోమ్‌ వ్యాలీ- మంత్రి కేటీఆర్‌

117
ktr
- Advertisement -

ప్రముఖ ఫార్మా సంస్థ జాంప్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాన్ని హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. జాంప్ ఫార్మాకు కెనడా దేశం బయట ఇదే ఏకైక కర్మాగారం. 250 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ద్వారా 200 మందికి ఉపాధి లభించనున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్‌లో జాంప్‌ హైదరాబాద్‌లోనే పెద్ద బ్రాంచ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌ను పరిశీలించిన అనంతరం.. కంపెనీ హైదరాబాద్‌ను ఎంచుకుందన్న మంత్రి.. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీల విస్తరణకు హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు.

అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్‌ వ్యాలీ అనువుగా ఉంటుందని, యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలన్నారు. గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్‌ కంటే హైదరాబాద్‌నే ఇష్టపడుతున్నారన్నారు. గ్లోబల్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 33శాతం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే జాంప్‌ ఫార్మాకు భూమిని కేటాయించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ-హబ్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు. బీ-హబ్ నిర్మాణంతో పాటు జీనోమ్ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. త్వరలో బీ-హబ్‌ను ప్రారంభించి, బయోలాజికల్‌ పరిశోధనలకు తోడ్పాటునందించబోతున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

- Advertisement -