దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలే- మంత్రి కేటీఆర్‌

42
ktr speech
- Advertisement -

హైదరాబాద్, మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో రూ.587 కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి. ఈ ప్రాజెక్టు ద్వారా ఓఆర్‌ఆర్‌ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలు, కాలనీలకు నీటి సరఫరా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డా. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. నగరం చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు ఇప్పటికే హైదరాబాద్‌తో కలిసిపోయాయని చెప్పారు. కార్పొరేషన్‌లో విలీనమైన అన్ని గ్రామాలకు నీరు అందిస్తామని వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని గ్రామాలను హైదరాబాద్‌లో భాగంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఓఆర్‌ఆర్‌ ఆవాసాలకు రూ.1200 కోట్ల వ్యయంతో నీరు సరఫరా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి తాగునీరు కూడా సరఫరా చేస్తామని తెలిపారు. కొండ పోచమ్మసాగర్‌ నీటితో గండిపేట చెరువును నింపాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు.

తెలంగాణ పథకాలే దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. రైతుబంధును మనం ప్రారంభించిన తర్వాత దేశంలోని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా విద్యుత్‌ సమస్యను పరిష్కరించామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని స్పష్టం చేశారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలకు వెళ్తే ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారని, ఎండాకాలం వచ్చిందంటే జలమండలి ఆఫీస్‌ ఎదుట మహిళలు ధర్నాలకు దిగేవారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -