మోడీ దోషిగా నిలబడాల్సిందే..!

29
ktr
- Advertisement -

కేంద్ర ఆర్థిక విధానాలను మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థ పైన చేసిన దొంక తిరుగుడు ప్రసంగం, మాటలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచలేవని మంత్రి కే. తారకరామారావు అన్నారు. తాజాగా పార్లమెంట్లో దేశ ఆర్థిక వ్యవస్థపైన జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అసత్యాలు పలికారని కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణం వలన సాధారణ ప్రజలు పడుతున్న బాధలపైన నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెప్పారన్నారు. లోక్ సభ లో చేసిన తన వ్యాఖ్యల ద్వారా కోట్లాదిమంది భారతీయులు పడుతున్న కష్టాలను ఆమె అవహేళన చేశారన్నారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు కేంద్ర మంత్రి ఎన్ని డొంక తిరుగుడు మాటలు మాట్లాడినా, తమ అసమర్ధ ఆర్థిక విధానాల వలన భారతదేశానికి కలుగుతున్న దారుణమైన ఫలితాలను, పరిణామాలను దాచలేరన్నారు. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం చరిత్రలో నిలుస్తుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడడం, 30 సంవత్సరాల్లోనే అత్యధిక ద్రవ్యోల్భనం, 45 సంవత్సరాల అత్యధిక నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్నా తక్కువ స్ధాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్ వెనకబడి ఉండడం వంటి అనేక దుష్పరిణామాలే ఇందుకు ఉదాహరణలు అన్నారు. సాధారణ ప్రజలు ఉపయోగిచే ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అసమర్ధ ఆర్థిక విధానాల ఫలితమే అన్నారు. ప్రజాస్వామ్య సూచీ నుంచి మొదలుకొని పత్రికా స్వేచ్ఛ వరకు, ఆర్థిక అసమానతల నుంచి అవినీతి వరకు ఏ విషయంలోనైనా గ్లొబల్ ర్యాంకుల్లో భారతదేశం ఈరోజు తీవ్రంగా వెనుకబడి ఉన్నదంటే దానికి ముమ్మాటికి కారణం బీజేపీ సారధ్యంలోని మోడీ ప్రభుత్వమే అన్నారు. అనాలోచిత డిమానిటైజేషన్, జిఎస్టి అమలు వంటి నిర్ణయాల వలన భారత ఆర్థిక వ్యవస్థ గత ఎనిమిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో చతికిల పడిందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అన్ని కష్టాలకు ఒకే మందుగా పేర్కొన్న డిమానిటైజేషన్ వలన కోట్లాది మంది ఉపాధులతోపాటు, వందలాది మంది ప్రాణాలను కోల్పోయారన్నారు. మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల నల్లధనం వెనక్కి తీసుకువస్తామని చెప్పిన మోడీ మాటలు ముమ్మాటికి అసత్యాలే అని తేలిపోయిందన్నారు. డిమానిటైజేషన్ తర్వాత ముందు 18 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో ఉంటే, ప్రస్తుతం 31 లక్షల కోట్లు నగదు చలామణిలో ఉందన్నారు. నోట్ల రద్దు తర్వాత సుమారు 68 శాతం నగదు అధికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని, కేవలం నగదు ముద్రణకే అర్‌బిఐ ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు.

జీఎస్టీ ద్వారా దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని, అర్థంలేని పన్ను స్లాబ్ లతో పాటు, ప్రజలకు అత్యవసరమైన వస్తువులపై సైతం భారీగా పన్నులు విధించి దోపిడీ చేస్తున్నదన్నారు. మరోవైపు పరిశ్రమను, పారిశ్రామిక వర్గాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు జిఎస్టి ద్వారా భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ప్రజలు ఉపయోగించే పాలు, పెరుగు, బియ్యం వంటి అత్యవసర వస్తువుల పైన సైతం భారీగా పన్ను మోపిన ప్రభుత్వం నరేంద్ర మోడీది అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేనేత వస్త్రాలపై సైతం జిఎస్టిని మోపిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పసిపిల్లలు వాడుకునే పెన్సిల్లు నుంచి మొదలుకొని హాస్పిటల్ బెడ్ల వరకు చివరికి అంత్యక్రియల వరకు అన్నింటిపై పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోడీదని కేటీఆర్ మండిపడ్డారు.

వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన పెట్రో పన్నుల భారాన్ని మోపి దోపిడీకి పాల్పడుతుందన్నారు. 2014 వరకు పెట్రోల్, డీజిల్ పైన ఉన్న కేంద్ర ప్రభుత్వ టాక్స్ లను భారీగా పెంచిదని, పెట్రోల్ పైన రెట్టింపు చేయడంతో పాటు డీజిల్ పైన సుమారు నాలుగున్నర రెట్లు పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు పెట్రో పన్నుల ద్వారా కేంద్ర రాష్ట్రాలకు సమానపు ఆదాయం వస్తుంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన భారీ పన్నుల వలన మోడీ ప్రభుత్వం దాదాపు రెండున్నర రేట్లు ఆదాయం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నదన్నారు. పెంచిన పెట్రో పన్నుల భారం నేరుగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసి ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు.

ఇలా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను అనాలోచిత నిర్ణయాలను భరించలేక ప్రపంచంలోనే అత్యంత పేరోందిన అనేకమంది ఆర్థికవేత్తలు, ఈరోజు ప్రభుత్వ మరియు ఆర్బిఐ పదవుల నుంచి వెళ్ళిపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తమ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ తన అబద్ధపు ప్రాపగాండా యంత్రాంగం ద్వారా కోవిడ్ సంక్షోభం మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలపై నెట్టెసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. అయితే లాక్ డౌన్ కన్నా ముందే వరుసగా 8 త్రైమాసికాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి దిగజారిన విషయం అందరికీ తెలుసు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా తీసుకుపోతున్న మోడీ ప్రభుత్వం తమ మందబలం ద్వారా జీఎస్టీ కౌన్సిల్ మరియు పార్లమెంట్ వంటి వ్యవస్థలలో తప్పించుకోగలదేమో కానీ కేంద్ర నిర్ణయాల వలన నిత్యం సతమతమవుతున్న దేశ ప్రజల అగ్రహం నుంచి తప్పించుకోలేదని కేటీఆర్ హెచ్చరించారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, రానున్న సవాళ్లను అంచనా వేయలేకపోవడం, అనాలోచిత నిర్ణయాలు, తమ మిత్రులైన భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం ఇవే మోడీ ప్రభుత్వ అసలైన ఆర్థిక విధానాలు అని కేటీఆర్ విమర్శించారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వ్యక్తులు, పార్టీలపైన తమ ప్రభుత్వ యంత్రాంగాలను ఉసిగొలిపి, విభజించు పాలించు అనే దుర్నీతితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా లేని తమ గొప్పలు చెప్పుకోవడం మాని, దేశ ప్రజల హితం దృష్ట్యా ద్రవ్యోల్బాణాన్ని అదుపులోకి తీసుకువచ్చి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలు తీసుకొవాలని కేటీఆర్ హితవు పలికారు.

- Advertisement -