అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి- మంత్రి కేటీఆర్

63
- Advertisement -

రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు, మేయర్లు, చైర్ పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల ఎలాంటి ఆటంకం లేకుండా స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమ లక్ష్యాలను అందుకునే దిశగా ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తే తెలంగాణలోని ప్రతి పట్టణానికీ జాతీయస్థాయి గుర్తింపు తప్పకుండా వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, వాటిని అమలు పరచిన తెలంగాణ పురపాలికలకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.

తెలంగాణ ప్రభుత్వం పట్టణాల పురోగతి కోసం ప్రత్యేకంగా టి.యు.ఎఫ్.ఐ.డి.సి అనే సంస్థను ఏర్పాటు చేసి పట్టణ ప్రగతి నిధులకు అదనంగా పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్న విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక నిధులతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని అయితే స్థానిక సంస్థల పరిధిలో ఉన్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, గ్రీనరీ నిర్వహణ వంటి కార్యక్రమాల పైన ఎక్కువ దృష్టి సారించాల్సిన బాధ్యతను పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. పురపాలన అంటేనే పౌర పాలన అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న కేటిఆర్, ఈ దిశగా పట్టణాల్లోని పౌరులను భాగస్వాములు చేసేలా వారితో మమేకమై పనిచేయాలని కోరారు. రానున్న ఆరు నెలలు లోపల సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లను పూర్తి చేయాలని, వీటితోపాటు పెండింగ్ పనుల పూర్తి పైన దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక కలెక్టర్ స్థాయి అధికారిని నియమించిన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని, ఇంతటి నిబద్ధతతో స్థానిక సంస్థల అభివృద్ధి కోసం పని చేస్తున్న ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకుని చిత్తశుద్ధితో అధికారులు పనిచేయాలన్నారు. జిల్లాలోని స్థానిక సంస్థలకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు పట్టణాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. ప్రతి పట్టణం రాష్ట్రంలోని ఇతర పట్టణంతో పోటీపడి తమ పట్టణాలను అభివృద్ధి చేసే దిశగా మరింత చురుగ్గా కదలాలని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, నగరంలో పచ్చదనం పెంచడం, నగరాలను తక్కువ ఖర్చుతో సుందరంగా తీర్చి దిద్దడం వంటి కార్యక్రమాలు తమదైన పనితీరును కనబరిచేందుకుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పురపాలనలో వినూత్నంగా ముందుకుపోతున్న కరీంనగర్ లాంటి కార్పొరేషన్‌తో పాటు ఇల్లందు లాంటి పురపాలికల అధికారులను ప్రజాప్రతినిధులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -