మానేరు రివర్ ఫ్రంట్‌ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష..

156
ktr
- Advertisement -

కరీంనగర్ లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన ఈరోజు హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, వి. శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ నగర మేయర్ సునిల్ రావు మరియు జిల్లాకు సంబంధించిన అధికారులు, సాగునీటి శాఖ, మునిసిపల్ వంటి వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మానేరు రివర్ ఫ్రంట్‌ను దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్, రెవెన్యూ, టూరిజం, మునిసిపల్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ లేదా ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ మానేరు రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు అవకాశం ఏర్పడిందని, ముఖ్యమంత్రి కేవలం సాగునీటి కోసమే కాకుండా ఈ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు టూరిజం వంటి రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు వేశారని, అందులో భాగంగానే కాళేశ్వరంతో పాటు కరీంనగర్ వద్ద మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారని ఆయన అన్నారు.

ఇప్పటికీ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం కోసం 310 కోట్ల రూపాయలను కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో ఈ ఫ్రంట్ డెవలప్మెంట్ ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పలు ఇతర రాష్ట్రాలు ఇలాంటి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రాల రాజధాని ప్రాంతాల్లోనే చేశాయని అయితే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు కరీంనగర్ పట్టణంలో ఇంత భారీ ఖర్చుతో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ డెవలప్ చేయాలన్న విజన్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికి కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారే అవకాశం ఉన్నదని, పూర్తిస్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్, వరంగల్ వంటి జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కరీంనగర్ పట్టణానికి ఐటీ టవర్ ద్వారా ఐటీ పరిశ్రమ కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని, రివర్ ఫ్రంట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత కరీంనగర్ పట్టణం మరింతగా అభివృద్ధి అవుతుందన్న ఆశాభావం కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కి అవసరమైన సహాయ సహకారాలను సాగునీటి శాఖతో పాటు భూసేకరణ వంటి అంశాల్లో రెవెన్యూ శాఖ మరింత వేగంగా ముందుకు పోవాలి అన్నారు.

ముఖ్యమంత్రి ఆలోచన నుంచి పురుడు పోసుకున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు తీసుకుపోతామని స్థానిక జిల్లా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. త్వరలో ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికిల్ వరకూ ఆ బాధ్యతలు కుడా నిర్వహిస్తుందని వెంటనే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే మానేరు రివర్ ప్రంట్‌లో అంతర్భాగమైన 4 చెక్ డ్యాంలు పూర్తయ్యాయని, మరో చెక్ డ్యాంతో పాటు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చివరిదశలో ఉన్నాయన్నారు. సీఎం ప్రోత్సాహం వల్లనే ఈ కార్యక్రమం ఈ రోజు ముందుకు సాగుతుందని, కరీంనగర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆలోచన విజన్ మేరకు దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే ఈ దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. రివర్ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమంలో టూరిజం శాఖ ఇప్పటికే చురుగ్గా పనిచేస్తుందని, తమ శాఖ తరఫున ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన అన్ని రకాల కార్యక్రమాలను తాము చేపడతామని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

- Advertisement -