సిద్దిపేట జిల్లా, ములుగు ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ 2వ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రైతుల ఆదాయం రెట్టింపు అన్నది ఒక్క చైనాలోనే సాధ్యం అయింది.. నాకున్న సమాచారం ప్రకారం అది మరెక్కడా సాధ్యం కాలేదు. 2022 వరకు మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని విఫలమయ్యారు. దేశంలో దాదాపు 60 – 65 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడింది.. కానీ దేశ జీడీపీలో దాని వాటా 15 శాతం దాటడం లేదు. వ్యవసాయంలో రైతుకు ఆదాయం ఎలా వస్తుందో ఆలోచన చేయాలి.. చైనా, ఇజ్రాయిల్ లలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి. 1987లో చైనా – ఇండియా జీడీపీ సమానం.. 35 ఏళ్లలో చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరింది.. ఇండియా 3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉందని మంత్రి గుర్తు చేశారు.
వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల ఆలోచనా విధానం మారాలి. తెలంగాణలో వరి మళ్లలో చేపలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది..ఈ దిశగా ప్రయత్నించాలి. వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువత ఈ దిశగా మళ్లే అవకాశం ఉంది. తెలంగాణలో బ్లూ, పింక్, వైట్, ఎల్లో,గ్రీన్ విప్లవాలు విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. ఈ తరం, కొత్తతరం ఎందుకో వ్యవసాయానికి దగ్గర కావడం లేదు. పాత, కొత్త అనుభవాలతో ఒక కొత్త విధానం తీసుకురావాలి.. యువతను ఆకర్షించాలి అని కేటీఆర్ సూచించారు.
తెలంగాణ 32 జిల్లాలలో ప్రతి చోటా 25 ఎకరాలలో రైతుశిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.. కొత్త తరానికి వ్యవసాయాన్ని పరిచయం చేయాలి. వ్యవసాయానికి ఆధునికతను జోడించేలా శాస్త్రవేత్తలు ఆలోచించాలి అన్నారు. చిన్ననాటి నుండే పిల్లలలో వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేయాలి. పౌల్ట్రీ, పత్తి, వేరుశెనగలకు తెలంగాణ ప్రసిద్ధి.. ఏడాదికి రెండు సార్లు 10 రోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక్రమం నిర్వహించాలి.. దీనిపై క్యాలెండర్ తయారుచేయాలి.. రైతు దినోత్సవం నిర్వహించాలి సూచించారు. శాస్త్రవేత్తలు వడగండ్లు, అకాల వర్షాలను తట్టుకునే వంగడాలను తయారుచేయాలి అన్నారు. ఫసల్ భీమాకు ప్రత్యామ్నాయంగా పంటలు యూనిట్ గా భీమా కంపెనీలతో మాట్లాడి శాస్త్రీయంగా కొత్త విధానం తీసుకురావాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు.