సినీ నటుడు సోనూసూద్ చేసిన సేవలను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కరోనా సమయంలో నిస్వార్థపూరితంగా ఆయన సేవలు చేశారని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ ఐసిసిలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీ రామారావు ,హీరో సోను సూద్ హాజరైయ్యారు. వీరితో పాటు ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… సమాజంలో సవాళ్లు ఎదురైనప్పుడు ప్రభుత్వం మాత్రమే అన్ని పనులూ చేయడం సాధ్యం కాదని చెప్పారు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా తేలికేనని చెప్పారు. అయితే, బాధ్యతగా సేవలు చేయడం గొప్ప అని ఆయన అన్నారు. సోనూసూద్ పేద ప్రజలకు సేవలు చేస్తోంటే ఆయన ఇళ్లు కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు చేయించి, ఆయనను భయపెట్టాలని అనుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయనకు సమాజంలో ఉన్న ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు. సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆయన వెంట తామంతా ఉన్నామని తెలిపారు.