శనివారం మంత్రి కేటీఆర్ వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంకర కుప్పలను తొలగించాలన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచింది. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని.. ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామన్నారు. వేములవాడ పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
10వ వార్డులో కమ్యూనిటీ మహిళా భవనానికి తక్షణమే రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మిషన్ భగీరథ లైన్ 60 శాతం పూర్తి అయిందని పేర్కొన్న కేటీఆర్.. దసరా లోపు వేములవాడ పట్టణంలో ఉన్న 14 వేల కుటుంబాలకు నల్లా నీరు అందిస్తాం అని చెప్పారు. ఒక్క రూపాయి చెల్లించి నల్లా కనెక్షన్ తీసుకోవచ్చు అని సూచించారు. వేములవాడలో మార్కెట్ నిర్మాణం కోసం రూ. 5 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. గడిచిన ఏడేళ్లలో వేములవాడ అభివృద్ధి ఎలా ఉందో మీరే చూసి చెప్పాలన్నారు.