రైతు బంధు, రైతు భీమా పథకం అన్నదాతకు అండగా నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మీ గార్డెన్ లో రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమంను మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పలువురు యాదవులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 30యానిట్లగొర్రెలు పంపిణి చేశారు. ఈసందర్భంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రూ.12వేల కోట్లతో రైతుబంధు పధకాన్ని ప్రారంభించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు మంత్రి కేటీఆర్.
గత ప్రభుత్వాలు 50 ఏండ్లలో ప్రాజెక్టులు కడితే టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏండ్లలోనే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. వెయ్యి కోట్లతో చేప పిల్లల పంపిణి చేశామన్నారు. సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజక్ట్ అని..కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు దేశంలోని పలువురు నేతలు, అధికారులు వస్తున్నారన్నారు. దేశంలో అత్యంత ధనికులైనా యాదవులు ఎక్కడున్నారంటే అది తెలంగాణలోనే అనే విధంగా చెప్పుకునే రోజులు వస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
గొల్లకురుమలను ఆదుకొవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. గతేడాది 60లక్షల గొర్రెలు పంపిణి చేశామని అవి ఇప్పుడు 80లక్షలకు చేరుకున్నాయన్నారు. గొర్రెలను పంపిణి చేయడమే కాకుండా వాటి సంరక్షణ కొరకు కూడా ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తుందన్నారు. తెలంగాణ నుంచి విదేశాలను మాంసం ఎగుమతి చేసే స్ధాయికి మనం ఎదగాలన్నారు. పాడి పంట బాగుంటేనే అన్నదాత సుఖంగా ఉంటాడన్నారు మంత్రి కేటీఆర్.