ప్ర‌తి గ్రామం నుంచి గులాబీ దండు కదలాలి..

33

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని, శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్లు, జడ్పీ చైర్మన్, జిల్లా, స్థానిక ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని తొమ్మ‌ది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్ర‌భుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ హుజురాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్నందున ఈ స‌మావేశానికి హాజ‌రుకాలేదు.టీఆర్ఎస్ ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వరంగల్‌లో నిర్వహించే విజయ గర్జన బహిరంగ సభ విజయవంతానికి చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… నవంబర్ 15న వరంగల్‌లో జరిగే విజయ గర్జన సభకు ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధం కావాల‌ని, ప్ర‌తి గ్రామం నుంచి గులాబీ దండు క‌దలి రావాల‌ని పిలుపునిచ్చారు. బహిరంగ సభ కార్యాచరణ కోసం గ్రామ మండల స్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా ముందుకు వెళ్ళుతుందని పేర్కొన్నారు.

ఉద్య‌మ సార‌ధిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన పరిపాలనతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకున్నారని అన్నారు. ప్రతి సారి ప్రజలు పార్టీపై తమ ప్రేమను వ్యక్త పరుస్తూ ఉండటం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అపూర్వమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాల‌ని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉద్య‌మ నేత కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ఎన్నో ప్ర‌తిబంధాకాల‌ను త‌ట్టుకుని బ‌ల‌మైన పార్టీగా ఎదిగింద‌న్నారు. ఎన్నిక‌లు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దేన‌ని, గ‌తంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకి ఇలాంటి విజ‌యాలు ద‌క్క‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను జాతీయ స్థాయిలో పార్టీల‌కతితంగా ప్ర‌శంస్తుంటే, స్థానిక నేత‌లు చిల్ల‌ర‌మ‌ల్ల‌ర‌గా మాట్లాడుతున్నార‌న్నారు. న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో జ‌రిగే విజ‌య గ‌ర్జ‌న బ‌హిరంగ స‌భ‌కు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు కదలిరావాలని, విప‌క్షాల‌కు టీఆర్ఎస్ సత్తా ఎంటో మరోసారి చాటి చెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.