గోదావరి నీళ్లను తీసుకొచ్చి సిరిసిల్ల,వేములవాడలోని బీడు భూములను సస్యశ్యామలం చేసామని తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ . వేములవాడలో మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ అభ్యర్థులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వేములవాడను దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని హామి ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే రెండు లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని మంత్రి తెలిపారు. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామనీ, యాదాద్రి ఆలయ పనులు త్వరలోనే పూర్తికానున్నాయని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ దృష్టంతా ఇక వేములవాడ, భద్రాచలం ఆలయాల అభివృద్ధిపైనే ఉందన్నారు. మరికొద్ది రోజుల్లోనే వేములవాడ, సిరిసిల్ల పట్టణాలు కలిసి పోతాయన్నారు. సిరిసిల్ల, కరీంనగర్ వైపు వెళ్తే మీరు కళలో కూడా ఉహించని దృశ్యం మీ కళ్లకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓటు వేస్తే ఏం లాభం లేదన్నారు. వాళ్లు రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో లేరు వాళ్ల వల్ల అయ్యేదేమి లేదన్నారు. ఇక బీజేపీ పార్టీ వాళ్లకు బిల్డప్ ఎక్కువ పని తక్కువ అన్నారు. నీతిఅయోగ్ ద్వారా మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వమంటే ప్రధాని మోదీ ఇప్పటివరకు 19పైసలు కూడా ఇవ్వలేదన్నారు.