రక్షణశాఖ భూములివ్వండి.. కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి

328
ktr with ministers
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు మంత్రి కేటీ రామారావు. హైదరాబాద్ నగరంలో నిర్మించనున్న స్కై వేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను అప్పగించాల్సిందిగా కోరారు. హైదరాబాద్ నుంచి నాగపూర్ జాతీయ రహదారి వైపు మరియు హైదరాబాద్ నుంచి రామగుండం రహదారి వైపు నిర్వహించే ఈ రెండు స్కైవేలకు సంబంధించి కంటోన్మెంట్ మరియు రక్షణశాఖ భూములను అప్పగించాలని గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తుందని, ఈ మేరకు గతంలోనూ పలు సార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాజ్ నాధ్ సింగ్ కు గుర్తు చేశారు.

ఈ స్కై వేల నిర్మాణంతో హైదరాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులు సాధ్యమైనంత వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని, వీటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ కేటీఆర్ తెలిపారు.ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటియార్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలపైన మాట్లాడారు. దీంతో పాటు పారిశ్రామికీకరణ మరింత వేగంగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సలహాలు, సూచనలు అందించారు.

ఈ సమావేశం అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరిని మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో “తెలంగాణ శానిటేషన్ హబ్” ఏర్పాటుకోసం సహకరించాల్సిందిగా కోరారు. ఈ హబ్ ఏర్పాటు ద్వారా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలోని ఇతర ఇతర రాష్ట్రాలకు కూడా పారిశుద్ధ్య రంగంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు కావాల్సిన పరిష్కారాలను కనుగొనే విధంగా ఈ హబ్ పరిశోధన కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ కేంద్రం ద్వారా పారిశుద్ధ్య రంగంలో ఉన్న అదర్శ విధానాలు మరియు పరిశోధనను పెంచేలా కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తుందని తెలిపారు. ఈ హబ్ ద్వారా దేశంలోని పురపాలికల్లో పారిశుద్ధ్యం, ఇతర అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని ముందుకు పోయేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటు ద్వారా సానిటేషన్ రంగంలో గుణాత్మకమైన మార్పు సాధించేందుకు అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి వంద కోట్ల రూపాయల సీడ్ ఫండింగ్ అందించాలని కోరారు
.

- Advertisement -